శాయంపేట, నవంబర్ 3 : మండలంలోని పెద్దకోడెపాక శివారులో దేవాదుల పైపులైన్ ఎయిర్‌వాల్వ్ లీకేజీ అయింది. సుమారు వంద అడుగుల ఎత్తుకు నీళ్లు ఎగిసిపడి ఫౌంటెన్‌ను తలపించింది. చుట్టున్న పంట పొలాల్లోకి నీళ్లు భారీగా చేరాయి. చలివాగు రిజర్వాయర్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలోని ధర్మసాగర్‌కు గోదావరి జలాలను మోటర్లతో పైపులైన్ ద్వారా పంపింగ్ చేస్తున్నారు.
చలివాగు పంప్‌హౌస్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్పై శనివారం రాత్రి కోతి పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఈ క్రమంలో నీటి పంపింగ్‌లో ఒత్తిడి జరిగి శనివారం అర్ధరాత్రి దాటాక పెద్దకోడెపాక బ్రాహ్మణకుంట పరిధిలో దేవాదుల పైపులైన్ ఎయిర్‌వాల్వ్ లీకేజీ ఏర్పడినట్లు చెబుతున్నారు. పెద్ద శబ్దంతో వంద అడుగులపైకి నీళ్లు ఎగజిమ్మాయి.
లీకేజీతో పెద్ద ఎత్తున ఎగిసిన నీళ్లు పైనున్న 220 హైటెన్షన్ విద్యుత్ వైర్లను తగలడంతో రైతులు భయంతో వణికిపోయారు. ఆదివారం మధ్యాహ్నం దేవాదుల ఇంజినీరింగ్ అధికారులు చలివాగు పంప్‌హౌస్‌లో మోటర్లను బంద్ చేశారు. అప్పటికే గంటల పాటు నీళ్లు ఎగిసిపడి చుట్టున్న పొలాలకు చేరాయి. చేతికొచ్చిన యాభై ఎకరాల వరి పంటలో నీళ్లు నిలిచాయి. దీంతో సుమారు ఇరవై మంది రైతులు తమ పరిస్థితి ఏంటని వాపోయారు. పంపింగ్ బంద్ చేసినప్పటికీ రాత్రి వరకు పైపులైన్ లీకేజీ కొనసాగినట్లు రైతులు చెప్పారు.