ఎల్కతుర్తి, ఏప్రిల్ 28: మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారైంది రైతుల పరిస్థితి. ఒక వైపు కోసిన వడ్లకు అధికారులు కాంటాలు వేయకపోవడంతో కొంతమంది రైతులు ఇబ్బందిపడుతుండగా, మరోవైపు కోతకొచ్చిన వరిని కోయడానికి హార్వెస్టర్లు సిద్ధంగా ఉన్నా వాటిల్లో పోయడానికి డీజిల్ దొరకక అటు హార్వెస్టర్ల యజమానులు, ఇటు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వెరసి పొలాల్లోనే కోతకొచ్చిన వరి గింజలు కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రస్తుతం వరి కోతలు మొదలై 15 రోజులు దాటుతున్నది. దీంతో వరి కోతలు కోసేందుకు ఇతర రాష్ర్టాలకు చెందిన హార్వెస్టర్లు కూడా ఎప్పటి లాగే ఈ ప్రాంతానికి వచ్చాయి. డీజిల్, పెట్రోల్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న బంక్ యజమానులు ముందుగానే సంబంధిత డీలర్లకు డీడీలు తీసి అప్పగించారు.
అయితే, డీజిల్, పెట్రోల్ కొరతతో రావాల్సిన ట్యాంకర్లు సమయానికి రావడం లేదు. దీంతో బంక్‌లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. డీజిల్ దొరకడం లేదనే సమాచారం వ్యాపించడంతో హార్వెస్టర్, ట్రాక్టర్ యజమానులు బంక్‌ల ఎదుట క్యూ కడుతున్నారు. వరి కోతల సమయం కావడంతో ధాన్యాన్ని రవాణా చేయడానికి రైతులంతా ముఖ్యంగా ట్రాక్టర్లపైనే ఆధారపడుతుంటారు. అయితే, డీజిల్ లేకపోవడంతో ట్రాక్టర్లు కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామాల్లో వ్యవసాయ పనులన్నీ స్తంభించిపోతున్నాయి.
ఎల్కతుర్తి మండలంలో మొత్తం 4 బంక్‌లు ఉండగా, కేవలం పెంచికల్‌పేట బంక్‌లో మాత్రమే డీజిల్ కొద్దోగొప్పో ఉంది. చుట్టు పక్కల గ్రామాలతోపాటు మండలాల నుంచి సైతం హార్వెస్టర్, ట్రాక్టర్ యజమానులు డీజిల్ క్యాన్లతో బంక్ ఎదుట క్యూ కడుతున్నారు. డీజిల్ దొరకదనే వదంతులతో దొరికిన వారు 2, 4 క్యాన్ల డీజిల్ తీసుకుపోతుండడంతో కూడా సమస్య ఏర్పడుతున్నది. ఇక లారీలు, కారులు, ఇతర వాహనాల వారు కూడా డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ బంక్‌ల వద్దే క్యూలో ఉంటున్న దృశ్యాలు ఏ బంక్ ముందు చూసినా కనిపిస్తున్నాయి. పెట్రోల్ కూడా స్టాక్ అయిపోతుందనే భావనతో ప్రతి వాహనం ఫుల్ ట్యాంక్ నింపుకుంటున్నారు.
డీజిల్ కొరతతో హార్వెస్టర్లు ముందుకు కదలకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. పొద్దంతా తీవ్ర ఎండతో వేడెక్కుతున్న వాతావరణం సాయంత్రం వేళల్లో మబ్బులు, చిరు జల్లులతో రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నది. కోతకొచ్చిన వరి కోయడానికి హార్వెస్టర్ల చుట్టూ తిరుగుతున్న రైతులు అటు మబ్బును చూసి గగ్గోలు పెడుతున్నారు. ఒక వేళ వర్షం కురిస్తే పొలాలు కోసుకోలేని పరిస్థితి. గత రబీ సీజన్లో ఇదే విధంగా వరి కోతల సమయంలోనే కురిసిన వర్షాలతో హార్వెస్టర్లు నడవకపోవడంతో ట్రాక్ మిషన్ల కోసం వెంపర్లాడారు. ఒక్కో గంటకు ట్రాక్ మిషన్‌కు చివరకు రూ.4వేలు ఇచ్చేందుకు కూడా రైతులు వెనకాడలేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడితే నిండా మునగడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హార్వెస్టర్లు నడిచేందుకు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి డీజిల్ కొరత లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.