కేసముద్రం, ఆగస్టు 30 : ఆరుగాలం కష్టించి పెసర పంటను పండిస్తే.. మార్కెట్లో పిసరంతే ధర పలుకుతుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పప్పు దినుసుల సాగు నిలువునా ముంచిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని రైతులు సుమారు 5,420 ఎకరాల్లో పెసర పంటను సాగుచేశారు.
పూత దశలో వరుస వర్షాలు పడడంతో ఏపుగా పెరిగి చేను నేల వాలడంతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్లు రావాల్సి ఉండగా కేవలం రెండు నుంచి మూడు క్వింటాళ్లే వచ్చింది. కొంత మంది రైతులు పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదని చేనులోనే కలియదున్నుతున్నారు. ఎకరం సాగుకు రూ.15 వేల వరకు పెట్టుబడికి ఖర్చు కాగా, దిగుబడి రాక, ధర లేక రైతులకు రెక్కల కష్టం కూడా మిగలడం లేదు.
క్వింటా పెసరకు ప్రభుత్వ మద్దతు ధర రూ.8,68 2 ఉండగా మార్కెట్లో గురువారం మోడల్ ధర రూ. 6,533, కనిష్ఠంగా రూ. 3,639 పలికింది. దీంతో రైతులు మద్దతు ధరకంటే రూ. 2500 వరకు నష్టపోతున్నారు. పంట కొనుగోలుకు ప్రభుత్వ రంగ సంస్థ ముందుకు రాకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఒకటి, రెండు రాశులకు అధిక ధర పెట్టి మిగిలిన వాటికి తక్కువ ధర కేటాయిస్తున్నట్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో పెసర పప్పు కేజీకి రూ. 125 పలుకుతున్నదని, కానీ వ్యాపారులు మాత్రం పెసర పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ తమను నష్టాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను నాలుగు ఎకరాల్లో పెసర పంట సాగు చేసిన. వరుసగా వర్షాలు పడి పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. సాగు చేసిన నాటి నుంచి పంటను మార్కెట్‌కు తీసుకవచ్చే వరకు సుమారు రూ.70 వేల ఖర్చు వచ్చింది. మార్కెట్లో క్వింటాకు రూ. 5,669 ధర పలికింది. ఏడు క్వింటాళ్లకు రూ. 40 వేలు వచ్చినయి. పంట సాగు చేసి రూ. 30 వేలు నష్టపోయిన. ప్రభుత్వం రైతు భరోసా డబ్బులిస్తే నష్టం తగ్గేది. వెంటనే ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా చూడాలి.
– పిట్టల ఎల్లయ్య, రైతు, బ్రాహ్మణకొత్తపల్లి, నెల్లికుదురు మండలం
పెసర పంటను సాగు చేస్తే లాభం రాకపోగా రెక్కల కష్టం మిగలడం లేదు. ఎకరం భూమిలో పంటను సాగు చేస్తే సు మారు 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు తీసుకురాగా క్వింటాల్‌కు రూ. 5,019కి కొనుగోలు చేశారు. ఈ ధరకు పెట్టిన పెట్టుబడి రాకపోగా నష్టాన్ని మూట కట్టుకున్న. ప్రభుత్వం పెట్టుబడికి డబ్బులు ఇవ్వకపోవడం, మద్దతు ధర కల్పించకపోవడం వల్ల నష్టపోయిన. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలి.
– గుగులోత్ ప్రమీల , రైతు, తొర్రూరు.