పెద్దవంగర, నవంబర్ 7: ప్రతిష్టాత్మకంగా ఇండ్ల నిర్మాణం చేపట్టామని చెబుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో తిరకాసు పెడుతున్నది. బిల్లుల చెల్లింపులో మార్పులు చేసి అయోమయానికి గురిచేస్తున్నది. విడుతల వారీగా ఇచ్చే రూ.5 లక్షల్లో రూ.60 వేలను ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తామని ప్రకటించడం సర్కారు వైఖరిని తెలియజేస్తున్నది.
నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడుతల్లో ఆర్థిక సాయం అందించాలి. బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష, రూప్ లెవల్లో రూ.లక్ష, స్లాబ్ లెవల్లో రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ. లక్ష చొప్పున ఖాతాల్లో జమ చేయాలి. అయితే స్లాబ్ లెవల్లో జమ చేసే రూ.2 లక్షలు విడుదలలో మార్పులు చేసింది. ఇందులో రూ.1.40 లక్షలే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని, మిగతా రూ.60 వేలను ఈజీఎస్ నుంచి విడుదల చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి గత నెల 27న ప్రకటించారు.
ఈ మేరకు స్లాబ్ లెవల్ బిల్లులో ప్రభుత్వం రూ.60 వేలు కోత విధించింది. జాబ్ కార్డ్ కలిగిన లబ్ధిదారులకు తమ ఇంటి వద్ద నిర్మాణ పనులు చేసుకునేందుకు 90 రోజుల పని దినాలు లెకించి నగదు అందజేస్తామని ప్రకటించింది. రోజుకు రూ.307 చొప్పున లెక్కిస్తే 90 రోజులకు రూ.27,630 మాత్రమే అవుతుంది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఏం) ద్వారా రూ.12 వేలు అందించనుంది. ఈ రెండింటి నగదు కలిపితే రూ.39,630 అవుతుంది. మరో రూ.20,370 నగదును ఏ ప్రాతిపదికన చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద పోచారం గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 35 ఇండ్లకుగాను 15 ఇండ్లు మాత్రమే బేస్మెంట్ లెవెల్లో పూర్తయ్యాయి. మండలం మొత్తంలో 320 మంజూరవగా వీటిలో 215 బేస్మెంట్ లెవెల్ వరకు, 34 మాత్రమే ఇండ్లు స్లాబ్ లెవెల్లో పూర్తయ్యాయి. మిగతా ఇండ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముందస్తుగా డబ్బులు అప్పు తెచ్చి నిర్మించాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని లబ్ధిదారులు చెబుతున్నారు. మరోవైపు ఇండ్ల నిర్మాణానికి ఇసుక టోకెన్లు ఇస్తామని చెప్పినా నామమాత్రంగా అమలవుతుండడంతో ఇసుక కొనుగోలు అదనపు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.