ఈ సమస్య మేకల నరేశ్ ఒక్కడిదే కాదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో సగం కంటే ఎక్కువ మందికి గ్యాస్ సబ్సిడీ అందడం లేదు. మహాలక్ష్మి, గృహజ్యోతి పేరిట ఉచిత కరంటు, రూ.500కే వంట గ్యాస్, ప్రతి మహిళకు రూ.2,500, రైతుభరోసా రూ.15వేలు, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యమకారులకు 250 గజాల స్థలం.. పింఛన్ పెంపు ఇలా ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నప్పటికీ కొద్దిమందికే అమలుకావడంపై అర్హులైన వారిని నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతికి నిత్యం వినియోగించే వాటిలో ఫ్రీ కరంటు, గ్యాస్ సబ్సిడీ అందకపోవడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఎన్నికలప్పుడు ఆర్భాటంగా హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా వాటి ఊసెత్తడం లేదని ఇదేనా ‘ప్రజాపాలన’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి నేడు ప్రజాపాలన సంబురాలకు సిద్ధమైంది. కేవలం రూ.500 కు గ్యాస్(మహాలక్ష్మి), 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహాజ్యోతి) మాత్రం అమలు చేయగా అవి కూడా కొంత మందికే సరిపెట్టారు. ఈ పథకం చాలామందికి అమలు కాక విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. గ్యాస్ సబ్సిడీది అదే పరిస్థితి. ఎన్నికల ముందు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో 13 గ్యాస్ ఏజెన్సీలుండగా వాటి పరిధిలో 1,91,923 మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో 1.50లక్షల మంది గ్యాస్ సబ్సిడీకి అర్హులు. కానీ వీరిలో సగం మందికి కూడా సబ్సిడీ రావడం లేదు. గ్యాస్ సబ్సిడీ రావడం లేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 6,46,303 ప్రజాపాలన దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ప్రతి మహిళకు రూ.2500 పథకానికి 1,20,820 దరఖాస్తులు రాగా, రూ.500కే గ్యాస్ కోసం 1,16,339, రైతుభరోసా కోసం 66,733, కౌలు రైతు పథకానికి 7,566, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,25,492, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కోసం 1,088, ఉచిత విద్యుత్ కోసం 88,499, దివ్యాంగుల పింఛన్ కోసం 3,807, ఇతర పింఛన్ల కోసం 25,316 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్యాస్, ఫ్రీ కరంటు మాత్రమే కొంతమందికి అందుతుండగా ఇతర ఏ పథకం కూడా అమలుకు నోచుకోలేదు. జిల్లాలో మొత్తం 56,795 మంది పింఛన్‌దారులు ఉండగా సర్కారు రెండింతలు చేస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేరక ఆశగా ఎదురుచూస్తున్నారు.
“మాది మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామం. నా గ్యాస్ కనెక్షన్ నంబర్ 654191. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్పినప్పటి నుంచి నేను నాలుగు సిలిండర్లు తీసుకున్నా. కానీ ఇప్పటివరకు ఒకదానికి కూడా సబ్సిడీ పడలేదు. ఎన్నికలప్పుడు గ్యాస్ సబ్సిడీ, కరెంట్ బిల్లు మాఫీ చేస్తరని చెబితే నమ్మి ఓట్లు వేసినం. ఇదేనా ప్రజాపాలన అంటే. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలైత లేవు. గ్యాస్ సబ్సిడీ రాక ప్రతి సిలిండర్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నా. ఇప్పటికైనా గ్యాస్ సబ్సిడీ వేస్తరో లేదో చూడాలె.”
గ్యాస్ సబ్సిడీ పైసలు పడతలేవు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల ముందు ఒక మాట గెలిచినాక మరొక మాట చెబుతున్నారు. రూ.1000 గ్యాస్ మొద్దుకు డబ్బులు పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలీచాలని ఆదాయంలో నిత్యావసర సరుకుల ఖర్చు పెరుగుతావున్నది. మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సబ్సిడీ కింద రూ.500 బ్యాంకులో వేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సబ్సిడీ డబ్బులు వేయా లి. రైతులకు రైతుభరోసా, పెన్షన్‌దారుల పింఛన్ పెంచి ఇవ్వాలి.