బయ్యారం, జనవరి 8 : ఇందిరమ్మ ఇండ్ల సర్వే తుది దశకు చేరుకోగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ రెండు గ్రామపంచాయతీల్లో మాత్రం సర్వే ప్రారంభం కాకపోవ డంతో అక్కడి ప్రజలు తమకు ఇండ్లు వస్తాయా ? రావా ? అంటూ ఆందోళన చెందుతున్నారు. మండలంలో 29 జీపీలు ఉండగా 27 పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తుది దశకు చేరుకుంది. కానీ ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ ఓపెన్ చేస్తే అల్లిగూడెం, వెంకటాపురం(లక్ష్మీపురం) పంచాయతీల పేర్ల్లు మాత్రం చూపించడం(లాగిన్) లేదు. దీంతో అక్కడ ఇంకా ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభం కాలేదు. వెంకటాపురం జీపీలో లక్షీపురం, కొత్తలక్ష్మీపురం, టేకులగూడెం, నర్సా పురం గ్రామాల్లో 272 కుటుంబాలతో 438 మంది జనాభా, అల్లిగూడెం జీపీలో బీమ్లాతండా, అల్లిగూడెం, దోరన్న తండా, పందిపంపుల గ్రామాల్లో 282 కుటుంబాలతో 510 మంది జనాభా ఉన్నారు.
ఇందులో అధిక శాతం పేద గిరిజన కుటుంబాలకు చెందిన వారు ఉండగా, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం అధికారులు ఇంటింటికి వస్తుండగా తమ గ్రామాల్లో మాత్రం సర్వే ఎందుకు చేయడం లేదో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. తమకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయో.. రావో..? అంటూ ఆందోళన చెందుతన్నారు. తమ గ్రామాల్లో సర్వే ఎప్పుడు చేస్తారంటూ జీపీ సెక్రటరీలను ప్రజలు ప్రశ్నిస్తుండడంతో వారికి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో విజయలక్ష్మిని వివరణ కోరగా.. అల్లిగూడెం, వెంకటాపురం జీపీలు ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్లో లాగిన్ కాకపోవడంతో అక్కడ సర్వే ప్రారంభించని మాట వాస్తవమే. ఈ విషయాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, సీఈవో దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
ఇల్లు కావాలని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాం. కొద్ది రోజుల క్రితం ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం అధికారులు ఇంటింటికి వస్తారని గ్రామంలో చెప్పిన్రు. కానీ ఇంత వరకు ఎవరూ రాలే. కొన్ని ఊళ్లల్లో ఇండ్ల కోసం సర్వే చేస్తున్నారంట. మా ఊరికి అధికారులు ఎప్పుడొస్తరో తెలవడం లేదు. సర్వే చేసి ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటాం.
– అనసూర్య, వెంకటాపురం
ఇందిరమ్మ ఇండ్ల సర్వే వెంటనే ప్రారంభించాలి. యాప్లో మా గ్రామం పేరు లాగిన్ కాకపోవడం వల్లనే ఇంకా సర్వే ప్రారంభించలేదని అధికారులు చెప్తున్రు. వెంటనే సమస్య పరిష్క రించి ఇంటింటి సర్వే చేపట్టాలి. లేకుంటే మాన్యువల్గానైనా చేపడితే బాగుంటుంది. ఇంకా సర్వే మొదలు పెట్టకపోవడం వల్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
– నారాయణ, అల్లిగూడెం