నెక్కొండ, నవంబర్ 14 : మతతత్వ బీజేపీ ఉచ్చులో యువత చిక్కుకోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. మండలంలోని రెడ్లవాడలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. మతవాదం కావాలా? ప్రజాస్వామ్యం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం ఉచితంగా 24 గంటల కరంట్ అందిస్తుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాగు మోటర్లకు మీటర్లను పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఓ పైపు సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించేందుకు పావులు కదుపుతున్న కేంద్రం ఆ నెపాన్ని టీఆర్ఎస్పై నెట్టాలని చూస్తున్నదన్నారు. మోదీతో పాటు బీజేపీ నేతలంతా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు.
రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరంట్‌తో పాటు మరెన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని, టీఆర్ఎస్ను బలపర్చాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ పాలనలో పల్లెలు, పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నాయన్నారు. ఏటా రూ.1,200 నుంచి 1500 కోట్లు వెచ్చించి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రైతన్నలను నట్టేట ముంచేందుకు యత్నిస్తుంటే సీఎం కేసీఆర్ వారి శ్రేయస్సే ధ్యేయంగా గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. మతతత్వ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నర్సంపేట నియోజకవర్గంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ సోలార్ లైట్లను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. త్వరలో నెక్కొండ- రెడ్లవాడ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్లవాడ, నెక్కొండ సొసైటీ చైర్మన్లు జలగం సంపత్‌రావు, మారం రాము, ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, జడీటీసీ లావుడ్యా సరోజన, మాజీ ఎంపీపీ ఆవుల చంద్రయ్య, సర్పంచ్ శ్రీలత, ఉప సర్పంచ్ వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.