మహబూబాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ)/డోర్నకల్ : కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం శనివారం మహబూబాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ క్యాంపు కార్యాలయంలో, డోర్నకల్‌లో బీఆర్ఎస్ నేత మాన్యు పాట్ని నివాసంలో ఆమె విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీఆర్ఎస్ అనంతరం బీఆర్ఎస్గా అవతరించిందన్నారు. పదిహేను నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపం, కుట్రలు బయటపడ్డాయన్నారు. మాళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహిరంగ సభకు వచ్చే ముందు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీగా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. రజతోత్సవ సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సత్యవతి అన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ రజతోత్సవ సభకు మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని, ఇందుకోసం ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, ఇతర వాహనాలు సమకూర్చామన్నారు. ప్రతి వాహనానికి ఒక ఇన్చార్జిని నియమించినట్లు తెలిపారు. కాగా, డోర్నకల్‌లో బంకంట్ సింగ్ తండాకు చెందిన మాలోత్ కృష్ణ బీఆర్ఎస్లో చేరగా సత్యవతి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మానుకోట పట్టణ అధ్యక్షుడు రవి, కార్యదర్శి రాజు, చిట్యాల జనార్దన్, అశోక్, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, మాజీ కౌన్సిలర్లు పోటు జనార్దన్, కొండేటి హేమచంద్రశేఖర్, నాయకులు కొత్త వీరన్న, కాలా యశోధర్జైన్, కందుల మధు, చంటి, గౌస్, సుర మధు తదితరులు పాల్గొన్నారు.