హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 10 : రాఖీ పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన ప్రజలకు తిరుగు ప్రయాణం తిప్పలు తప్పడం లేదు. మూడు రోజులు సెలవులు రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన జనమంతా తిరిగివెళ్తుండడంతో హైదరాబాద్ రూట్లో రద్దీ విపరీతంగా పెరిగింది. వరంగల్ రీజియన్‌లోని పరకాల, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేటతో పాటు ఉమ్మడి వరంగల్‌కు కేంద్ర బిందువైన హనుమకొండ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వచ్చిన బస్సు ఎక్కేందుకు అగచాట్లు పడ్డారు. ఆయా డిపోలకు చెందిన ఆర్టీసీ అధికారులు బస్స్టేషన్లలో బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. ఆదివారం రాత్రి వరకు సుమారు 500 ట్రిప్పులు హనుమకొండ నుంచి హైదరాబాద్ రూట్లో నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కాగా, రద్దీ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దుచేసి హైదరాబాద్ రూట్లో నడపడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం, భూపాలపల్లి, నర్సంపేట, తొర్రూరు, పాలకుర్తి, ధర్మసాగర్, వరంగల్ సిటీ ప్రయాణికులు బస్సుల కోసం రోడ్ల మీద నిరీక్షించారు. స్పెషల్ బస్సుల పేరిట అధికారులు అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు మండిపడ్డారు.