మహదేవపూర్,జూన్ 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్, మహాముత్తారం మల్హర్, పలిమెల, కాటారం ఐదు మండలాల నిరుపేదలకు పెద్దదిక్కుగా ఉన్న మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అంబులెన్స్ డ్రైవరే నిరుపేద రోగుల పాలిట దిక్కయ్యాడు. సోమవారం వివిధ అనాఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కు వచ్చిన వారికి అక్కడ విధులు నిర్వర్తించే అంబులెన్స్ డ్రైవర్ బిపి చెక్ చేయడం పలువురిని విస్మయానికి గురిచేసింది. నిరుపేదలకు మెరుగైన సేవలందించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ సామాజిక దవాఖానలో కనీస సౌకర్యాలు వసతులు సరిపడా వైద్యులు లేకపోవడంతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారాజ్యం కొనసాగుతోందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఇటీవల మండల పరిధిలోని ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన ఓ యువకుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. పేదల పాలిట పెద్దదిక్కుగా ఉన్న ప్రభుత్వ దవఖానలో అంబులెన్సు డ్రైవర్ పేషెంట్లకు బిపి చెక్ చేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఘన కీర్తి కలిగిన ఆసుపత్రి లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది.
నాడు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సకల సౌకర్యాలు మెరుగైన వైద్య సేవలు అందించిన ప్రభుత్వ హాస్పిటల్ ఇలాంటి దుస్థితి దాపురించడం దారుణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ వైద్యంపై పేద ప్రజలకు నమ్మకం పెరిగేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై హాస్పిటల్ సుపరిండెంట్ వైద్యురాలిని వివరణ కోరగా దవాఖానలో సరిపడా వైద్యులు, సిబ్బంది కొరత ఉందని దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. హాస్పిటల్లో ఉన్న సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదించామని త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.