వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొందరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వో) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పని వేళలను పాటించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సారు ఎప్పుడొస్తారో తెలియక బాధితులు గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో 47 పోలీస్ స్టేషన్లుండగా.. కొద్ది మంది మాత్రమే స్థానిక క్వార్టర్లలో ఉంటున్నారు.
మిగతా వారంతా వరంగల్‌లో ఉంటూ అప్ అండ్ డౌన్ చేస్తుండడంతో స్టేషన్‌కు సమయానికి రాలేకపోతున్నారు. కొందరు 11 గంటలకు వచ్చినా.. వెంటనే బందోబస్తు, విచారణ, ఏసీపీ, సీపీ మీటింగ్ పేరుతో బయటకు వెళ్తున్నారు. మరికొందరు మధ్యాహ్నం తర్వాత వస్తుండగా.. మిగతా వారు రాత్రి 7 గంటల తర్వాతే బాధితులకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో స్టేషన్‌కు వచ్చే వారు ఇన్స్పెక్టర్ల కోసం వేచిచూస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఎస్సైలు మాత్రం పెండింగ్ కేసులు ఎక్కువవుతుండడంతో పాటు తమకు పని భారం పెరుగుతుందంటున్నారు.
– సుబేదారి, జనవరి 8
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 47 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లుండగా, నగర పరిధిలో పది, మిగతావి 15 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇందులో చాలా స్టేషన్లకు ఇన్స్పెక్టర్లే స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా ఉన్నారు. వీరిలో చాలా మంది వరంగల్‌లో ఉంటూ స్టేషన్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. పనివేళలు పాటించకపోవడంతో పర్యవేక్షణ గాడితప్పుతున్నది. బాధితులు రిసెప్షన్ విభాగంలో ఫిర్యాదు అందజేసిన తర్వాత రశీదు ఇచ్చి సారు లేడు.. రేపు రండి అని చెబుతున్నారు.
ఈ క్రమంలో అడ్మిన్ ఎస్సైలు ఫిర్యాదులపై స్పందించడంలేదు. ఏదైనా సమస్య వస్తే తామే బాధ్యులమవుతామని వెనుకడుగువేస్తున్నారు. చాలా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బాధితులను పది రోజుల వరకు కూడా ఇన్స్పెక్టర్లు కలవకపోవడంతో వారికి న్యాయం జరగడం లేదు. దీనికి తోడు ఇన్స్పెక్టర్లు ఆదేశాలిచ్చే వరకు ఫిర్యాదులపై ఎస్సైలు కేసులు నమోదు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో విచారణలో జాప్యం జరిగి, కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని తెలుస్తున్నది. సీపీ నెలవారీ నేర సమీక్షలో చాలామంది ఈ విషయంలో చివాట్లు తింటున్నప్పటికీ మార్పు రావడంలేదు.
రాత్రివేళ శాంతిభద్రతల ఎస్సైలే దిక్కవుతున్నారు. ఇన్స్పెక్టర్లు రొటేషన్‌లో వారంలో ఒక రోజు నైట్ పెట్రోలింగ్ చేసి ఉదయం ఇంటికి చేరుకుంటున్నారు. నైట్ పెట్రోలింగ్ చేసిన మరుసటిరోజు స్టేషన్‌కు రావడానికి కొందరు ఇన్స్పెక్టర్లు విముఖత చూపుతున్నారు. ఈ సమయంలో గ్రామాల్లో రాత్రివేళ ఏవైనా ఘటనలు జరిగితే ఎస్సైలే అక్కడికి చేరుకుంటున్నారు. రాత్రి కొంతమంది సిబ్బంది మాత్రమే డ్యూటీలో ఉంటుండడంతో ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు సకాలంలో చేరుకోవడంలేదు.
దీనికి తోడు కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్ హైవేలపై రాత్రి వేళ ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత ఇన్స్పెక్టర్లు స్టేషన్ క్వార్టర్స్‌లో లేకపోవడంతో పోలీసులు వెంటనే స్పందించడంలేదు. సిబ్బంది ద్వారా సమాచారం అందుకునే సదరు ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకోవడం ఆలస్యమై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందుతున్నారు. ఈ పరిస్థితి హైవేల్లోని రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, ఎల్కతుర్తి, ఆత్మకూరు, పరకాల, మామునూరు, గీసుగొండ పోలీస్స్టేషన్ల పరిధిలో ఉంది.
కొందరు ఇన్స్పెక్టర్లు డ్యూటీ వేళల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని పరకాల, వర్ధన్నపేట, కాజీపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, నర్సంపేట డివిజన్ల పరిధిలోని ఇన్స్పెక్టర్లు వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చాలామంది మధ్యాహ్నం తర్వాత స్టేషన్ నుంచి బయటకు వెళ్లి, లంచ్‌కు ఇంటికి వచ్చి కునుకు తీసి సాయంత్రం 6 తర్వాతే స్టేషన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. బాధితులు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు వారి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు ఊళ్లకు వెళ్లేందుకు రాత్రి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పోలీసు స్టేషన్లో అందుబాటులో ఉండని ఇన్స్పెక్టర్లపై దృష్టి సారించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.