Imran Khan : పాక్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను జైలు అధికారులు దగ్గర్లోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) పార్టీ నేతలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగష్టు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆయనను కలిసేందుకు ఇటీవల కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం లేదు.
ఆయన అనారోగ్యం పాలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కంటి చూపు చాలా వరకు కోల్పోయారని, అలాగే జైలులో ఆయనపై పలు రకాల దాడులు జరిగాయనే ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాలేదు. ఇదే సమయంలో ఇటీవల ఇమ్రాన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయనను తాజాగా ఒక ఆస్పత్రికి రహస్యంగా తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని అధికారులు చెప్పలేదు. ఎవరికీ తెలియకుండా చికిత్స అందించడంపై ఇమ్రాన్ స్థాపించిన పీటీఐ పార్టీకి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో కావాలనే పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్‌కు ఏ చికిత్స అందించినా ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో, ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలోనే అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇమ్రాన్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకే వస్తుందన్నారు. మరోవైపు త్వరలోనే ఇమ్రాన్‌ను త్వరలో ఇస్లామాబాద్‌లో నూతనంగా నిర్మించనున్న జైలుకు తరలిస్తామన్నారు. రెండు నెలల్లో ఆ జైలు నిర్మాణం పూర్తవుతుందని, అక్కడ మెరుగైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని పాక్ మంత్రి ఒకరు తెలిపారు. మరోవైపు ఖాన్ ఆరోగ్య స్థితిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. తనకు కనీస వసతి సౌకర్యాలు కల్పిస్తే చాలని ఆయన ఇటీవల జైలులో కోరినట్లు తెలుస్తోంది.