నర్సంపేట, మార్చి 22: రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. దీనిపై శనివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రెండు పేజీల లేఖ రాశారు. ఈ సందర్భంగా పెద్ది విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు వ్యవసాయానికి, రైతులకు ఇచ్చిన హామీలకు ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్నారు.
రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కొద్ది మందికే మాఫీ చేశారని పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లాలో 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందనీ, ఇంకా 60 శాతం మంది రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అనేక మంది రైతులు ప్రైవేట్ ఫైనాన్స్‌ల్లో బంగారాన్ని కుదువబెట్టి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి బ్యాంకులో కట్టి రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ పర్చిందన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి మోసం చేసిందని విమర్శించారు. భవిష్యత్‌లో ఈపథకం కొనసాగుతుందన్న నమ్మకం లేదని చెప్పా రు. కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని మోసం చేసినట్లుగానే వ్యవసాయ కూలీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని పెద్ది దుయ్యబట్టారు. నర్సంపేట నియోజకవర్గానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.60 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు సబ్సిడీ రూపంలో నిధులు కేటాయించగా, ప్రస్తుతం ఆ పథకాన్ని నిలిపివేశారని పెద్ది గుర్తు చేశారు.
వ్యవసాయ మోటర్లు, పైపులు తీసుకున్న రైతులకు, కంపెనీల కు బిల్లులు చెల్లించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లే దని అర్థమౌతుందన్నారు. రైతు లు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర చెల్లిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తుందనీ, అది కూడా పూర్తిస్థాయిలో అంద డం లేదన్నారు. మార్కెట్లో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యాపారులు మార్కెట్లో సిండికేట్‌గా మారి దోపిడీ చేయడంతో రైతుకు పెట్టుబడి కూడా రావడంలేదన్నారు.
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పినా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం బాధాకరమని పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. వేలాది ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ను సాగు చేశారని, సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి సర్కారు నిధులు కేటాయించాలని కోరారు. హార్టికల్చర్ యూనివర్సిటీ కేంద్రానికి కేవలం స్వల్పకాలికంగానే నిధులు కేటాయించారని, వేతనాలు, నిర్వహణకు మాత్రమే ఇవి సరిపోతాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా మంజురైన హార్టికల్చర్ రీసెర్చ్ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలానికి కొత్తగా మంజూరైన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్‌కు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు దీనిపై చొరవ చూపకపోవడం, అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడమేనన్నారు.