నర్సంపేట, జూన్ 15 : దొడ్డ మోహన్‌రావు సేవలు అజరామరమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవాతత్పరుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దొడ్డ మోహన్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం గుండెపోటుతో మృతిచెందడంపై పెద్ది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అనంతరం హుటాహుటిన మోహన్‌రావు ఇంటికి చేరకుని ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గానికి దొడ్డ చేసిన సేవలను గుర్తుచేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా నియోజకవర్గంలోని తను పుట్టిన గ్రామమైన చెన్నారావుపేట మండలం లింగగిరి అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. నర్సంపేటలో జిల్లా ఆస్పత్రి భవనం కోసం తన 20 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. మిషన్ కాకతీయ లాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోనే మొదటి విరాళం అందించిన గొప్ప దాత మోహన్‌రావు అని పేర్కొన్నారు.
మాధన్నపేట లాంటి ఎన్నో గ్రామాలను దత్తత తీసుకుని అభివృది ్ధ చేశారన్నారు. ప్రధానంగా నిరుపేదలను అక్కున చేర్చుకొని, వారి ఆలనాపాలనా చూసుకోవడానికి అనాథాశ్రమం ఏర్పాటు చేసి అభాగ్యులకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు అనాథ పిల్లలకు అన్నీ తానై వివాహాలు జరిపించిన ఆయన ఓ శక్తి అని కొనియాడారు. దొడ్డ మృతి నియోజకవర్గానికి తీరని లోటని, ఆయన అశయసాధనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.