నల్లబెల్లి, జూన్ 15: ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ దొడ్డ మోహన్ రావు మృతిపట్ల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్ధించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తను పుట్టి పెరిగిన నర్సంపేట ప్రాంత అభివృద్ధికోసం, సేవా కార్యక్రమాల కోసం దాతృత్వాన్ని చాటుకున్న గొప్ప మానవతావాది అన్నారు. తన స్వగ్రామం చెన్నా రావుపేట మండలంలోని లింగగిరి గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని పునర్నిర్మించి, గుట్ట చుట్టూ భక్తుల కోసం అనేక మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందించారని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి మొదటి దాతగా లింగగిరి గ్రామంలో చెరువులను అభివృద్ధి చేశారన్నారు. నర్సంపేట పట్టణంలోని జిల్లా హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిర్మాణానికి దాతగా 20 ఎకరాల స్థలాన్ని అందించి పేద ప్రజల వైద్యం కోసం తన మానవతా హృదయాన్ని చాటుకున్నారని స్పష్టం చేశారు. అంతేగాక మాదన్నపేట కట్టపైన శివాలయాన్ని పునర్మించారని చెప్పారు. మాదన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పెద్ది ప్రగాఢ సానుభూతిని తెలిపారు.