వర్ధన్నపేట, జూన్ 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల రూపురేఖలు మారాయని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా వర్ధన్నపేటలో శుక్రవారం పట్టణ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సఫాయి కార్మికురాలు, కార్మికుడి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మలు ఎత్తుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే, అంబేద్కర్ సెంటర్లో మహిళలతో కలిసి ఎమ్మెల్యే కోలాటం ఆడారు.
అనంతరం ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో అరూరి రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెలతో పాటు పట్టణాలను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించనట్లు తెలిపారు. ఇందులో భాగంగానే వర్ధన్నపేట గ్రామ పంచాయతీని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసినట్లు చెప్పారు. అంతేకాక పట్టణంలో ఇప్పటి వరకు రూ.187 కోట్ల మేర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అభివృద్ధి పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేయించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ఇటీవల రూ.84లక్షల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు.
పట్టణానికి ప్రధాన ఆధారంగా ఉన్న కోనారెడ్డి చెరువు కట్ట కోసం రూ.13కోట్లు మంజూరు చేయించి, కట్టను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు పట్టణంలో వైకుంఠధామాలు, సెంట్రల్ లైటింగ్, పార్కులు, ఓపెన్జిమ్ వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయించి, పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఎంపీ దయాకర్ మాట్లాడుతూ ప్రజావసరాలను గుర్తించి.
ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదన్నారు. గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే రమేశ్ కృషితో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులతో వర్ధన్నపేట పట్టణ వాతావరణాన్ని సంతరించుకుంటుందన్నారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రమేశ్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, కమిషనర్ రవీందర్, బీఆర్ఎస్ నాయకులు తూళ్ల కుమారస్వామి, పులి శ్రీనివాస్, తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు.