తొర్రూరు/ నల్లబెల్లి/ గూడూరు/ వర్ధన్నపేట, సెప్టెంబర్ 21 : బతుకమ్మ పండుగకు పైసల్లేవు.. గ్రామాల్లో వీధి లైట్లు, చెరువుల వద్ద మొరం పోసి చదును చేయడం, శానిటేషన్, తదితర ఏర్పాట్లు ఎలా చేయాలని కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావస్తుందని, అప్పటి నుంచి రూపాయి రాలేదని, తమకు వచ్చే వేతనాలతోపాటు అభివృద్ధి పనులకు డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యామని వాపోతున్నారు. దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరుతున్నారు. గతేడాది బతుకమ్మ, దసరా వేడుకలకు తాము ఖర్చు చేసిన నిధులు తమకు ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయలేదని, ఈసారి ఏర్పాట్లపై చేతులెత్తేశారు.
పల్లెల్లో బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లు పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా మారాయి. ఇందుకు కావాల్సిన నిధులు రాకపోవడంతో వారు లబోదిబోమంటున్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తుండగా, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామపంచాయతీల పాలన సాగుతోం ది. అయితే, నిధుల లేమి కారణంగా అభివృద్ధి పను లు నిలిచిపోయాయని గ్రామస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో వర్షాల కారణంగా రహదారులు బురదమయమై గుంతలతో నిండిపోయాయి.
బతుకమ్మ వేడుకల కోసం వేదికలు సిద్ధం చేయడం, వీధిలైట్లు అమర్చడం, చెరువుల వద్ద మొరం పోసి చదును చేయడం, డీజే ఏర్పాటు వంటి పనులకు కనీసం రూ.25వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతున్నది. అయితే జీపీలకు నిధులు రాకపోవడంతో ఈ భారమంతా కార్యదర్శుల భుజాలపైనే పడుతోంది. ఇప్పటికే పండుగలు, జీపీ నిర్వహణ కోసం కొందరు కార్యదర్శులు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. తొర్రూరు మండలంలోని అమ్మాపురంలో బతుకమ్మ ఆడే ప్రదేశంలో శానిటేషన్, వీధిలైట్లు ఏర్పాట్లు చేయలేదు.
అదేవిధంగా ఎంపీడీవోలు, ఎంపీవోల ఆదేశాల మేరకు కొన్ని గ్రామాల్లో అవసరమైన శానిటేషన్, వీధిలైట్లు ఏర్పాట్లు చేయగా, దాతల సహాయంతో డీజే సౌండ్ వంటి అవసరాలను తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు తాము గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులు మేజర్ జీపీలకు రూ. 6-7 లక్షలు, చిన్న జీపీలకు రూ. 3 లక్షల వరకు రావాల్సి ఉందని కార్యదర్శులు చెబుతున్నారు. తమ వేతనాలతోపాటు అప్పులు తెచ్చి ఖర్చులు పెడుతున్నామని, తమ పిల్లలకు బట్టలు కొనివ్వలేని దుర్భర పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు. కాగా, వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్ వద్ద అధికారులు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఆదివా రం మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడారు.