హనుమకొండ, డిసెంబర్ 2 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్నది. కొత్త పవర్ పాలి‘ట్రిక్స్’కు తెరలేస్తున్నది. సర్పంచ్ రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులు తమ రూటును మార్చుకుంటున్నారు. ప్లాన్ బీని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు అనుకూలమైన వార్డు మెంబర్‌గా పోటీ చేసి చెక్ పవరున్న ఉప సర్పంచ్ పదవి కైవసం చేసుకునేందుకు పోటీలో దిగుతున్నారు. ఇందుకోసం పడరాని పాట్లు పడుతున్నారు.
సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్ ఉండడంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, 50 శాతం మహిళా రిజర్వేషన్లు ఉన్న చోట కనీసం ఉప సర్పంచ్ పదవి దక్కించుకొంటే తాము పెత్తనం చెలాయించే అవకాశం ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. వార్డు సభ్యునిగా గెలువడంతో పాటు విజయం సాధించే అవకాశాలున్న ఇతర సభ్యుల మద్దతును కూడగట్టుకొనే ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. దీంతో ఈ అంశం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్లాన్ బీపై అభ్యర్థుల ఫోకస్
ఇన్నాళ్లు సర్పంచ్ స్థానంపై ఆశ పెట్టుకున్న అభ్యర్థులు రిజర్వేషన్ల తారుమారుతో ప్లాన్ బీని అమలు చేయడంపై ఫోకస్ పెట్టారు. పదవి ఉంటే గ్రామాల్లో పెత్తనం చెలాయించడం సాద్యమని, అందుకోసం ఉప సర్పంచ్ పదవైనా చేజిక్కించుకోవాలనే ఆలోచనతో, పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు గ్రామాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్ అయిన స్థానాల్లో ఉప సర్పంచ్ పదవులకు భారీగా డిమాండ్ పెరిగింది.
మహిళా సర్పంచ్ ఉన్న చోట పెత్తనం చెలాయించేందుకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయంతో ఉప సర్పంచ్‌పై కన్నేసి పావులు కదుపుతున్నారనే చర్చ పల్లెల్లో సాగుతున్నది. కాగా, ఈ పదవి దక్కాలంటే వార్డు సభ్యుల మద్దతు తప్పనిసరి కావడంతో తమకు అనుకూలంగా ఉండే, తమ మాట వినే వారినే పోటీలో దింపుతున్నారనే చర్చ జరుగుతున్నది. వారికి అవసరమైన పనులను దగ్గరుండి చక్కబెడుతున్నారని, ఆర్థికంగా లేనివారికి ఖర్చులు భరించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.
దండం పెడుతా.. జర ఊకోరాదె!
ఎల్కతుర్తి/ఏటూరునాగారం, డిసెంబర్ 2 : ‘జర నీ నామినేషన్ విత్‌డ్రా చేసుకోరాదె.. చేసు కుంటే నేను ఏకగ్రీవం అయిత. నీకేం కావాలన్న ఇస్త.. దండం పెడుతా’ అని పోటీ చేస్తున్న అభ్య ర్థులు వేడుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి దశ నామినే షన్ల ప్రక్రియ పూర్తయి ఉపసంహరణకు బుధవారం చివరి రోజు కావడంతో బుజ్జగింపులు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఓట్లతో అదృష్టాన్ని పరీక్షించుకునే బదులు అభ్యర్థులను విత్‌డ్రా చేపిస్తే ఏ గొడవ ఉండదనే ఉద్దేశంతో బతిమిలాడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా మంతనాలు చేస్తున్నారు.
కొన్నిచోట్ల డబ్బు లు ఆశ చూపడం, అవసరమైతే కాళ్లు పట్టుకునైనా రాజీ పడాలంటూ వేడుకుంటున్నట్లు తెలుస్తున్నది. అభ్యర్థుల బంధువులు, తెలిసిన వారికి ఫోన్లు చేసి పరిస్థితిని వివరిస్తూ నయానో, భయానో వారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కొందరికి బరిలో నిలిచే ఆర్థిక శక్తి లేనప్పటికి నామినేషన్ వేశారు. ఒక వేళ ఏకగ్రీవం చేసేందుకు కూర్చుని మాట్లాడుకుంటే అదృష్టం వరించవచ్చనే ఆలోచనతో కొందరు ఉండగా, ఎంతో కొంత ఇస్తే ఊరుకుంటామనే వారు ఉన్నారు. చర్చలు పెట్టి సర్పంచ్ ఒక పార్టీకి ఉప సర్పంచ్ మరొక పార్టీకి ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.
జోరుగా దావత్‌లు
గ్రామాల్లో వార్డులు, కులాల వారీగా దావత్‌లు జోరుగా సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచే పలాన కులం వారి ఇంటి దగ్గర విందు ఉందని, వారంతా అక్కడికి రావాలని ముందుగానే చెప్తున్నారు. వారికి మటన్ లేదా చికెన్ మందు ఏర్పాట్లు చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయ త్నాలు చేస్తున్నారు. అయితే పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు పడనివారి ఇండ్లకు సైతం వెళ్తూ బతిమలాడుకుంటున్నారు. గతంలో జరిగినవి మరిచిపోవాలని, తనదే తప్పని క్షమాపణలు చెపుతూ కాళ్లబేరానికి దిగుతుండడం విశేషం. అయితే నేడు నామినేషన్ల విత్‌డ్రా పర్వం ముగియనుండడంతో పోటీదారులను తప్పించేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.
ఉపసంహరణకు అభ్యర్థుల కిరికిరీలు
నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు కిరికిరీలు పెడుతున్నారు. తాము తప్పుకుంటే ఏం టి లాభమని ప్రశ్నిస్తున్నారు. ఓ గ్రామంలో ఏ పార్టీ మద్దతు లేకుండా వేసిన అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని కోరితే ఇందిరమ్మ ఇల్లు, రూ. 1.50 లక్షలు ఇస్తే ఓకే అన్నట్లు తెలుస్తోంది. దీం తో బుజ్జగింపు కోసం వెళ్లిన వారు అవాక్కయినట్లు తెలిసింది. కొంత మంది విషయంలో నేరు గా పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి విత్‌డ్రా కావాలని, వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో నీకే మొదటి ప్రాధాన్యత ఇస్తామంటూ బుకాయిస్తున్నారు. అయితే అప్పటి రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అని కొందరు విత్ డ్రా కావడానికి మెళిక పెడుతున్నట్లు తెలుస్తున్నది. ఇక మీటింగు రావాలంటూ అభ్యర్థులను పిలిపించుకుని విత్ డ్రా ఫారంలపై సంతకాలు చేయించుకుని దగ్గర పెట్టుకుంటున్న ట్లు సమాచారం. విత్‌డ్రా చేసుకునే అవకాశం బుధవారం మధ్యాహ్నం వరకు ఉండడంతో ఎవరి ప్రయత్నంలో ఉన్నారు.