జనగామ చౌరస్తా, ఏప్రిల్ 9 : బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు పాతాళంలో బొందపెట్టడం ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జనగామ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ దళిత నాయకుడు తిప్పారపు విజయ్‌ని బుధవారం ఆయన పరామర్శించారు.
అనంతరం మీడియాతో పల్లా మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాధితులు కేవలం బీఆర్ఎస్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారని అన్నారు. చట్టానికి కట్టుబడి ఉన్నాం కాబట్టే బీఆ ర్ఎస్ నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్ట్‌ల విషయంలో న్యాయస్థానాలను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. కడియం శ్రీహరి ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరని పేర్కొన్నారు.
దళిత సమాజమంతా కలిసి మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న తరుణంలో దళిత దొర కడియం శ్రీహరి అమాయక దళిత, గిరిజన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయించి జైళ్లకు పంపించడాన్ని యావత్ దళిత జాతి క్షమించదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబిస్తే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరికి నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే సక్రమంగా మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, మాజీ ఎంపీపీ బైర గోని యాదగిరి, మాజీ కౌన్సిలర్లు ముస్త్యాల దయాకర్, సమద్, మసిఉర్ రెహ్మాన్, నీల యాదగిరి పాల్గొన్నారు.