హనుమకొండ, మే 21 : ఉద్యమానికి కేంద్ర బిందువైన ఓరుగల్లు కాంగ్రె స్ రెండున్నరేండ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన మాజీ కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సమయంలో దాస్యం వినయ్‌భాసర్ ఓరుగల్లు కేంద్రంగా పోరాడారన్నారు. వరంగల్ పశ్చిమ ప్రజలు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఓటమి చెందారని.. దానికి దుష్ప్రచారమే కారణమన్నారు. కొందరు అధికార పార్టీ నాయకులు ఒకసారి గెలిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దొరికిందే అవకాశం అని దోచుకుంటూ.. దాచుకుంటున్నారన్నారు. ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి పెడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కచ్చితంగా క్షేత్రస్థాయిలో పని చేస్తూ ఓటు మ్యాపింగ్ చేద్దామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తూ, ఒకరి అవినీతిని మరొకరు కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. ఒక ఆడబిడ్డకు న్యాయం జరగడం లేదని, ఈ కాంగ్రెస్, రేవంత్ పాలనలో ప్రజల తరపున పోరాడుతున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. అమ్మాయి గోడును కూడా వినిపించలేని స్థితిలో నేడు మీడియా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు లు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఓటరు, పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ప్రతి బూత్ నుంచి ఇద్దరు డిజిటల్ సైనికులు పార్టీ సభ్యత్వ నమోదు కోసం పని చేయాలన్నారు.
అనంతరం మాజీ ఎమ్మె ల్యే దాస్యం వినయ్ భాసర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సైన్యం పోరాడుతున్నదన్నారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని, ప్రజా పాలన పేరిట ప్రతీకార పాలన కొనసాగిస్తున్నదన్నారు. ప్రజల తరపున ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నామన్నారు. గతంలో బూత్ స్థా యిలో పని చేసిన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చామని, రాబోయే రోజుల్లోనూ ఇస్తామన్నారు. ఎస్ఐఆర్ కోసం ఇప్పటికే స్థానికంగా నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని, మనం కూడా క్షేత్రస్థాయిలో మరింత బలంగా పని చేద్దామన్నారు. ఓటరు నమోదు, పార్టీ సభ్యత్వం నమోదుపై పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్టీ ఆఫీస్‌పై కుట్ర లు, కుతంత్రాలు చేస్తున్నారని వాటిని ఎదిరిస్తామని, ఛేదిస్తామని వినయ్‌భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాసుదేవరెడ్డిని వినయ్‌భాసర్ శాలువాతో సన్మానించారు. అలాగే ఇటీవల పదవీ విరమణ పొందిన మైనార్టీ కమిషన్ సభ్యులు దర్శన్‌సింగ్, మాజీ కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, చెన్నం మధు, ఇమ్మడి లోహితరాజు, సంకు నర్సింగరావును దాస్యం సతరించారు. కార్యక్రమ ప్రారంభంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహ్మద్ సోనీ అకాల మరణానికి మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.