గార్ల, ఏప్రిల్ 7: పోలీస్ పహారా, నిర్బంధాల నడుమ పాలేరు లింక్ కెనాల్ సర్వేను రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం వద్ద రూ.204 కోట్లతో నిర్మించే పాలేరు లింక్ కెనాల్ కోసం నాలుగు బృందాలు దుబ్బగూడెం కట్టు నుంచి సర్వే చేపట్టారు. 140 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి లింక్ కెనాల్, చలివాగు నుంచి 100 మీటర్లు, మర్రిగూడెం వద్ద 240 మీటర్లతో కెనాల్ నిర్మించనున్నట్లు సర్వే బృందం వెల్లడించింది. సర్వేలో గార్ల తహసీల్దార్ శారద, డోర్నకల్ తహసీల్దార్ రాఘవరెడ్డి, జిల్లా డిప్యూటీ సర్వేయర్ ఆధ్వర్యంలో గార్ల, కురవి, గూడూరు, డోర్నకల్, గంగారం సర్వేయర్లు నందులాల్, ధనలక్ష్మి, రాజు, వెంకన్న, శివయ్య పాల్గొన్నారు.
మండలంలో మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ సర్వే కోసం మున్నేరు జల సాధన కమిటీ ముఖ్య నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి గార్ల పోలీస్ స్టేషన్లో ఉంచారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాన్ని నిరసిస్తూ మండల అఖిలపక్ష నాయకులు మండల కేంద్రలోని నెహ్రూ సెంటర్లో 2గంటల పాటు రాస్తారోకో, ధర్నా చేశారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రముఖ న్యాయవాది జంపాల విశ్వ అన్న పానీయాలు ముట్టకుండా పోలీస్ స్టేషన్లో నిరసన చేపట్టారు. మండలంలోని భూములకు నీరు ఇవ్వకుండా పాలేరుకు తరలించి అక్కడి నుంచి ఎన్ఎస్పీ (నాగార్జున సాగర్ ప్రాజెక్టు) కెనాల్ ద్వారా సత్తుపల్లి, సూర్యాపేటకు తరలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుట్ర చేస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంపాల విశ్వ, సీపీఎం, సీపీఐ నాయకులు కందునూరి శ్రీనివాస్‌రావు, కట్టెబోయిన శ్రీనివాసరావు, సభ్యులు శీలంశెట్టి రమేశ్, జడ సత్యనారాయణ, సక్రు నాయక్, కతి సత్యం, వాంకుడోత్ శ్రీకాంత్ రాధాకృష్ణను ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్టులను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ‘లింక్ కెనాల్ వద్దు – మున్నేరు ప్రాజెక్ట్ ముద్దు’ అంటూ ఉద్యమిస్తున్న ఖుపజల గొంతు నొక్కేయడం ప్రజాస్వామ్యాన్ని పాతాళంలోకి నెట్టేయడమేనని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. పోలీసుల చర్యను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. లింక్ కెనాల్ సర్వే పనులు వెంటనే నిలిపివేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత డిమాండ్ చేశారు. గార్లలో పోలీసుల దింపి యుద్ధ వాతావరణం కల్పించడం అప్రజాస్వామికమని ఇల్లెం దు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ తెలిపారు.