చెన్నారావుపేట, నవంబర్ 15: చెన్నారావుపేట ప్రాథమిక సహకార సంఘంలో రైతులకు రుణాల మంజూరు విషయంలో అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైస్ చైర్మన్ చింతకింది వంశీ ధ్వజమెత్తారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో అర్హులైన రైతులందరికీ రుణాలు అందజేస్తామని చెబుతున్న అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకొని రుణాలు ఇవ్వకుండా ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. సొసైటీ వారోత్సవాల్లో భాగంగా శనివారం కార్యాలయ ఆవరణలో చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి సహకార సంఘం జెండాను ఆవిష్కరించారు.
అనంతరం డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సంఘం అభివృద్ధి, రైతులకు రుణాల మంజూరుపై చర్చించారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, అతడి సోదరుడు సొసైటీ కార్యాలయానికి చేరుకొని తమ అనుచరులకు ముందుగా రుణాలు ఇవ్వాలని డైరెక్టర్లతోపాటు తనతో వాగ్వాదానికి దిగినట్లు వంశీ తెలిపారు. గొడవ ముదరడంతో నర్సంపేట సీఐ రమణమూర్తి, నెక్కొండ ఎస్సై మహేందర్, చెన్నారావుపేట పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతిపజేసినట్లు చెప్పారు. పైరవీలు లేకుండా రుణాలు ఇస్తామని, ఏ పార్టీ జోక్యం చేసుకోవద్దని వైస్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. సొసైటీలో రుణాల మంజూరు విషయంలో అధికార పార్టీ నాయకుల జోక్యాన్ని పీఏసీఎస్ వైస్ చైర్మన్ వంశీ ప్రశ్నించాడు. దీన్ని జీర్ణించు కోలేని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూ క్యా గోపాల్‌నాయక్.. తనపై వంశీ దుర్భాషలాడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశా డు. దీంతో పోలీసులు వంశీతోపాటు బీఆర్ఎస్ నేత నరేందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చెన్నారావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాత్రి నె క్కొండ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో స్టేష న్కు చేరుకొని నెక్కొండకు ఎందుకు తరలించారని పోలీ సులను నిలదీశారు. సీఐ వారికి సర్దిచెప్పి పంపించా రు.
అసలు చెన్నారావుపేట సొసైటీలో ఏం జరుగుతోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన రుణమాఫీ డబ్బులు, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ డబ్బులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన కమీషన్ కలిసి సుమారు రూ. 8కోట్లు సొసైటీ ఖజానాలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, కాంగ్రెస్ నాయకులతో నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాతే సొసైటీ డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికార పార్టీ నాయకులు సీఈవోపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సొసైటీలోని డబ్బులను ఖర్చు చేయాలంటే అధికారం కావాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే రైతుల వద్ద మంచి పేరు సంపాదించడం కోసం రుణాల మంజూరులో కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సొసైటీని కాపాడుతూ తమను రక్షించాలని రైతులు కోరుతున్నారు.