ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించింది. పేద రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో అంతా రివర్స్ అయ్యింది. ఆస్పత్రుల నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో అత్యాధునిక పరికరాలు పనిచేయకుండా పోయాయి. రోగ నిర్ధారణ పరీక్షలు సైతం నిలిచిపోయాయి. ఆఖరికి రోగులకు ప్రాణవాయువుగా నిలిచే ఆక్సిజన్ ప్లాంట్లు సైతం మూతపడ్డాయి. దీంతో అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఈ సమస్య ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో తీవ్రంగా ఉండడంతో వైద్యులు వరంగల్‌కు రెఫర్ చేస్తూ రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
– ములుగు, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ కరువైంది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాటు, శ్వాసకోశ తదితర ప్రాణాంతక వ్యాధులతో వచ్చే వారికి ఇదే ప్రాణవాయువుగా ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా సమయం (2021)లో ఈ దవాఖానలో రూ. 60 లక్షలతో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించింది. సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, వార్డుల్లోని రోగుల బెడ్ల వద్దకు పైపుల ద్వారా నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేసింది.
ఏడాది పాటు ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి జరిగి రోగులకు సేవలందాయి. తదనంతరం నిర్వహణ సరిగాలేక మరమ్మతుకు గురైంది. రెండేళ్లుగా బల్క్ సిలిండర్ల ద్వారా సెంట్రల్ సిస్టమ్ నుంచి రోగులకు ఆక్సిజన్ అందించారు. ప్రస్తుతం సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ కూడా మరమ్మతుకు గురికావడంతో ఆరు నెలలుగా రోగులకు ఆక్సిజన్ అందడం లేదు. అలాగే కరోనా సమయంలో దాతలు విరాళంగా ఇచ్చిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సరైన రీతిలో వినియోగించుకోకపోవడంతో అవి కూడా మూలనపడ్డాయి. దీంతో అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
చిన్న కారణం చూపి వరంగల్‌కు..
ములుగు ప్రభుత్వ దవాఖాన వైద్య విధాన పరిషత్ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్‌కు ములుగు దవాఖాన బదిలీ అయినప్పటి నుంచి వైద్యులు రోగులకు సరైన వైద్య సేవలందడం లేదు. చిన్న కారణంతోపాటు ఆక్సిజన్ కొరత ఉందని రోగులకు వైద్యం అందించకుండా వరంగల్‌కు రెఫర్ చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ములుగు జిల్లా కేంద్రంలో ఉంటున్న సీఆర్పీఎఫ్ జవాన్ కుమారుడి ఘటన నిలుస్తున్నది. గత శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఐదేళ్ల బాలుడు రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడుతున్నాడని తల్లితోపాటు అమ్మమ్మ ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చారు.
పరీక్షించిన డ్యూటీ డాక్టర్ బాలుడికి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఉందని, ఇక్కడ ఆ సౌకర్యం లేదని, వరంగల్ ఎంజీ ఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తన భర్త డ్యూటీపై భద్రాచలం వెళ్లాడని, చికిత్స అందించాలని బాలుడి తల్లి 8.30 గంటల వరకు ప్రాధేయ పడినట్లు తెలిసింది. పరిస్థితి విషమంగా మారుతుండడంతో 108లో ఎంజీఎంకు తరలించగా ప్రస్తుతం బాలుడు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితి ప్రతిరోజూ ఉంటుండడంతో రోగులు, వారి అటెండెంట్లు వైద్యులు, ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిస్క్ చేయలేకపోతున్నాం
నేను ఇటీవలె బాధ్యతలు చేపట్టాను. దవాఖానలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాను. రోగులకు కావాల్సిన సదుపాయాలు లేక, వారి ప్రాణాలను రిస్క్‌లో పెట్టలేక ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నాం. రెండేళ్ల నుంచి ఆక్సిజన్ ప్లాంట్ మూతపడి ఉంది. సెంట్రల్ ఆక్సిజన్ పైప్‌లైన్ కూడా మరమ్మతుకు గురైంది. ప్రస్తుతం రోగులకు బీ టైప్ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నాం. ఇక్కడి సమస్యలపై ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన తర్వాత వాటిని పరిష్కరిస్తాం.
– డాక్టర్ చంద్రశేఖర్, దవాఖాన సూపరింటెండెంట్