ఆగస్టు 15 వరకు టార్గెట్ పూర్తి చేయాలి
అటవీ శాఖ ఆధ్వర్యంలో 30 కోట్ల మొక్కల పెంపకం
ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి
సీవోఎఫ్ ఆశాలతతో కలిసి పాకాలలో అభివృద్ధి పనులు, ప్లాంటేషన్ పరిశీలన
ఖానాపురం, జూలై 7 : రాష్ట్రంలో 8వ విడుత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె సీవోఎఫ్ ఆశాలత, డీఎఫ్‌వో అర్పణతో కలిసి మండలంలోని దబీర్‌పేట, కీర్యతండాలో బ్లాక్ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనం, పాకాలలో పలు అభివృద్ధి పనులతో పాటు, ఔషధవనం, సీతాకోక చిలుకల పార్కును పరిశీలించారు. ఔషధ మొక్కల పార్కు వద్ద మొక్క నాటారు. పాకాల వ్యూ పాయింట్ నుంచి మేడి వనాలను పరిశీలించి, పెద్ద మొక్కలను నాటించాలని ఎఫ్ఆర్వో రమేశ్‌కు సూచించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. హరితహారంతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెరిగిందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటామని స్పష్ట చేశారు. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నానన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో 30 కోట్ల మొక్కలు పెంచామన్నారు. వచ్చే ఏడాది కోసం 10 కోట్ల మొక్కలను రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. పాకాల అభివృద్ధికి నిధుల కొరత లేదన్నారు. ‘కంపా’ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పాకాలలో త్వరలో బోటింగ్ సౌకర్యం పునరుద్ధరిస్తామని తెలిపారు. ఇక్కడి సీతాకోక చిలుకలు, ఔషధ మొక్కల పార్కు బాగున్నాయన్నారు. పాకాల చెరువు ప్రధాన తూమును పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్ తదితరులు పాల్గొన్నారు.