వరంగల్ చౌరస్తా : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ( Chhattisgarh ) సరిహద్దుల్లో ఉన్న కర్రె గుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను ( Operation Kagar ) కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని దళిత హక్కుల పోరాట సమితి ( డీహెచ్‌పీఎస్ ) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. శనివారం వరంగల్‌లో నిర్వహించిన సమావేశంలో పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడారు.
మావోయిజం భౌతిక నిర్మూలన కాదు-రాజ్యాంగబద్ధ పరిష్కారం కావాలని అన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్రెగుట్టలను పారా మిలిటరీ బలగాలతో ముట్టడించడం, ఆదివాసీల హక్కులను పూర్తిగా పట్టించుకోకపోవటం సరైనతీరు కాదన్నారు.
సీపీఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ తమ శాంతియుత చర్చల సన్నద్దతను ఇప్పటికే ప్రకటించినప్పటికీ, కేంద్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. అన్ని ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి తక్షణ కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సంఘీ ఎలేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జన్ను రవి పాల్గొన్నారు.