సుబేదారి, ఫిబ్రవరి 19 : హనుమకొండ కాకతీయ జూపార్కులో వణ్య ప్రాణులు రోదిస్తున్నాయి. అరుదైన జంతువులు, పక్షు జాతులను ప్రజలు చూసేందుకు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో మూగజీవాలు బక్కచిక్కిపోతున్నాయి. జంతు, పక్షులకు తగిన మోతాదులో ఆహారం అందించకపోవడం, నాసిరకమైన ఆహారంతో అరుదైన పెద్ద జంతువులు మృత్యవాత పడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం జూపార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. వారి నుంచి నెలకు సగటున రూ.15 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఆదాయం వస్తున్నదని జూ అధికారులే చెప్తున్నారు. అయినా జంతువుల బాగోగులు చూడడంలో జూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాసిరకం ఆహారం, మల మూత్రాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం, అనారోగ్యం బారిన పడినప్పుడు సరైన వైద్యం అందించేందుకు అనుభవమున్న వెటర్నరీ అధికారిని నియమించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కాకతీయ జూపార్కుకు ఇంతకుముందు పూర్తి స్థాయి పర్యవేక్షణ అధికారి ఉండేవారు. ఏడాదిన్నర కాలంగా ఇన్చార్జి అధికారి బాధ్యతలతో పార్కు కళ తప్పింది. అటవీ శాఖ మంత్రి జిల్లా వాసికావడంతో చొరవ తీసుకొని కొన్ని నెలల క్రితం పెద్ద పులులు, రెండు దున్నలు, తెల్ల పులిని ఇక్కడికి తీసుకొచ్చారు. వీటి రాకతో పార్కుకు సరికొత్త అందం వచ్చింది. కానీ, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో మూడు నెలల క్రితం పెద్దపులులు అనారోగ్యం భారిన పడ్డాయి. దీంతో వాటిని హైదారాబాద్ జూ పార్కుకు తరలించారు. ఇటీవల తెల్ల పులి అనారోగ్యానికి గురై మృతి చెందింది. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జంతువులు అనారోగ్యం పాలవుతున్నాయి.
ఇంతకు ముందు అనుభవనం ఉన్న వెటర్నరీ వైద్యుడు ఉండగా, ఓ అధికారితో విభేదాలు రావడంతో ఆయన అక్కడ పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జూపార్కుకు పూర్తి స్థాయి పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో, వన్యప్రాణుల సంరక్షణ, పార్కు పచ్చధనం పరిశ్రుభత లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పనిచేసస్తున్న ఇన్చార్జి అధికారి మహబుబాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో రెగ్యులర్ డ్యూటీని వదిలి, పలుకుబడితో ఏడాదికిపైగా పార్కు పర్యవేక్షణ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. సదరు అధికారి డ్యూటీ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పార్కు కళ తప్పిందని సిబ్బంది చెప్తున్నారు. పార్కుకు పూర్తి స్థాయి పర్యవేక్షణ అధికారిని, అలాగే జంతు, పక్షుల వైద్యం కోసం సీనియర్ వెటర్నరీ వైద్యుడిని నియమించాలని సందర్శకులు అటవీశాఖ మంత్రిని కోరుతున్నారు.