వరంగల్, ఫిబ్రవరి19 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం తరలింపునకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. మరో 15 రోజుల్లో తరలించేందుకు సిద్ధమవుతున్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నెల రోజులుగా ఆఫీస్ ఇంటీరియల్ పనులు చకచకా సాగుతున్నారు. అధికారులే దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. కళలసౌధంగా వెలిగిపోవాల్సిన కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయం తరలింపుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నా.., అధికారులు అవేమీ పట్టించుకోకుండా పనులు కానిచ్చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం కుడా కార్యాలయం కింద భాగంలో ఉన్న మున్సిపల్ ఆర్డీ కార్యాలయం కాళోజీ కళాక్షేత్రంలోకి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కుడా కార్యాలయాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుండడంతో కుడా అధికారులు అందులో ఉన్న వివిధ కార్యాలయాలకు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మున్సిపల్ ఆర్డీ కార్యాలయానికి సైతం కాళోజీ కళాక్షేత్రం కేటాయించాలని కుడా అధికారులను కోరారు. ఇటీవల మున్సిపల్ ఆర్డీ షాహిద్‌మసూద్ కుడా వైస్ చైర్మన్ చాహత్ బాజ్‌పాయ్‌ను కలిసి కోరారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కాళోజీ కళాక్షేత్రం వైపు చూస్తున్నాయి. కళలకు వేదికగా నిలవాల్సిన కాళోజీ కళాక్షేత్రం ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మళ్లీ టెండర్లు
కుడా కార్యాలయాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుడా అధికారులు మళ్లీ టెండర్లు పిలువనున్నారు. గతంలో పిలిచిన టెండర్లలో కేవలం నాలుగు సంస్థలు మాత్రమే రావడంతో అధికారులు మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవారం రోజుల్లో టెండర్ నోటీఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.