వరంగల్, అక్టోబర్ 27 : గ్రేటర్ కార్పొరేషన్లోని స్వీపింగ్ మిషన్లు మూలన పడ్డాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మిషన్ల టెండర్లు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో నగర ప్రధాన రహదారులను ఊడ్చే స్వీపింగ్ మిషన్లు బల్దియా కార్యాలయంలో పడి ఉన్నాయి. వీటి వినియోగ బాధ్యతలను ప్రజారోగ్యం విభాగం చూసుకుంటుండగా, టెండర్లను మాత్రం ఇంజినీరింగ్ విభాగం పిలవాల్సి ఉంది. దీంతో రెండు విభాగాల మధ్య సమన్వయలోపంతో ఈ మిషన్లు మూలన పడ్డాయి.
స్వీపింగ్ మిషన్ల టెండర్ ముగిసి సుమారు 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బల్దియా అధికారులు మళ్లీ టెండర్లు పిలువలేదు. దీంతో గ్రేటర్లోని 12 స్వీ పింగ్ మిషన్లు మూలన పడ్డాయి. టెండర్లు పొందిన ఏజెన్సీలు వాటి మెయింటనెన్స్, డ్రైవర్ల వేతనం, వాహనాల రిపేర్లు, డీజిల్ నింపడం తదితర బాధ్యతలను చూసుకుంటాయి. స్వీపింగ్ రూట్ మ్యాపింగ్ చేస్తూ పని చేయించుకోవడం ప్రజారోగ్య విభా గం చూసుకుంటుంది. 6 పెద్ద స్వీపింగ్ మిషన్లు, మరో 6 చిన్న మిషన్లు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద మిషన్లు రాత్రి సమయం లో నగర ప్రధాన రహదారులు స్వీపింగ్ చేస్తుంటాయి.
స్వీపింగ్ మిషన్లు మూలన పడడంతో ప్రధాన రహదారులపై కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా స్వీపింగ్ మిషన్లు రాత్రి సమయంలోనే మెయిన్ రోడ్లు, డివైడర్ల మధ్య పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తుంటాయి. ప్రస్తుతం స్వీపింగ్ మిషన్లు రోడ్డెక్కక పోవడంతో కార్మికులే ప్రధాన రహదారులను శుభ్రం చేస్తున్నారు.
తెల్లవారుజామున ప్రధాన రహదారులు, డివైడర్ల మధ్య శుభ్రం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల హనుమకొండ లైఫ్లైన్ ఆస్పత్రి సమీపంలో మెయిన్ రోడ్డు డివైడర్ వద్ద శుభ్రం చేస్తున్న కార్మికురాలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నగర ప్రధాన రహదారులను ఊడ్చేందుకు స్వీపింగ్ మిషన్లను కొనుగోలు చేసిన బల్దియా అధికారులు వాటి నిర్వహణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు.