హనుమకొండ, నవంబర్ 21: చరిత్ర కలిగిన వరంగల్ మహా నగరంలో మొదటిసారిగా ఈనెల 23న ఆఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు మారథాన్ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వరంగల్ క్రెడాయ్ సౌజన్యంతో తెలంగాణ రన్నర్స్, వరంగల్ రన్నర్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు విభాగాలుగా మారథాన్ నిర్వహిస్తున్నామని 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు 21.100 కిలోమీటర్లుగా విభజించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందజేయనున్నట్లు తెలిపారు.
ఆఫ్ మారథాన్‌కి 2600 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు, రాష్ర్ట కీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనరెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, పోలీస్ కమిషనర్, నిసిపల్ కమిషనర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ, ఇతర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర జిల్లాలలో నిర్వహించిన క్రమంలో మన నగరంలో మొదటిసారి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, మారథాన్‌లో పాల్గొనేవారికి చిప్ ఏర్పాటు చేసిన దాని ద్వారా వారి రన్ టైమ్ గుర్తించడం జరుగుతుందన్నారు.
కాళోజీ కళాక్షేత్రం నుంచి ఫారెస్ట్ ఆఫీస్, ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ మీదుగా మళ్లీ కాళోజీ వరకు ఉంటుందన్నారు. మారథాన్‌లో పాల్గొనేవారికి ప్రతిచోట ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు, వైద్య సదుపాయాలు, మొబైల్ టాయిలెట్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే రన్నర్స్ వలన మన నగర కీర్తి మరింత బలోపేతం అవుతుందని, ఉదయం 5 గంటలకు 21.10 కిలోమీటర్ల రన్, 6 గంటలకు 10 కిలోమీటర్ల రన్, 7 గంటలకు 5 కిలోమీటర్ల రన్ ప్రారంభమై 9 గంటల వరకు ముగుస్తుందన్నారు.
అనంతరం కాళోజీ కళాక్షేత్రం పక్కన ఉన్న హయగ్రీవాచారి మైదానంలో బహుమతుల ప్రదానం, ముఖ్యఅతిథుల ప్రసంగాలు ఉంటాయని వెల్లండించారు. ఈ సందర్భంగా ఆఫ్ మారథాన్ పోస్టర్లు, టీ షర్ట్స్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మారథాన్ రన్నర్స్జగన్మోహన్రెడ్డి, డాక్టర్ సుధాకర్, ఉదయ్‌రెడ్డి, రవి, చరణ్, సరస్వతి, టౌటిరెడ్డి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.