దామెర/వెంకటాపూర్, ఆగస్టు 1 : రైతులందరూ మోటర్లకు నాణ్యమైన కెపాసిటర్లను అమర్చుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలంలోని దుర్గంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో జరిగిన పొలం బాటలో సీఎండీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన కెపాసిటర్లు వాడడం ద్వారా విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉండవని, మోటర్లపై భారం పడదని తెలిపారు. రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే పొలంబాట చేపట్టామన్నారు.
మోటర్ దగ్గర ఎర్తింగ్ సరిగ్గా ఉందో లేదో ప్రతి రైతు చూసుకోవాలని, సర్వీస్ వైరు అతుకులు లేకుండా ఉండాలన్నారు. ఇనుప డబ్బాలకు బదులుగా ప్లాస్టిక్ డబ్బాలు వాడితే ఇండక్షన్ వచ్చే ప్రమాదం ఉండదన్నారు. రైతులు మోటర్‌ను ప్లాస్టిక్, కర్రతోనే ఆన్ చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో స్వయం గా ఫ్యూజ్ వైరు మార్చడం, ఇతర విద్యుత్ పనులు చేయొద్దని కోరారు. సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమం లో సీఈ కిషన్, ఎస్ఈలు వెంకటరమణ, మల్చూర్, డీఈలు సామ్యానాయక్, నాగేశ్వర్రావు, శ్రీధర్‌చారి, సదానందం, ఏడీఈలు దేవేందర్, సందీప్ పాటిల్, స్వామిరెడ్డి, ఏఈలు గుర్రం రమేశ్, సురేశ్, వేణుగోపాల్, సాంబరాజు, లైన్మెన్ వేణు, సురేశ్ పాల్గొన్నారు.