ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు అంతా ఇంతా కావు. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణలో నీటి వనరులు తక్కువ. వ్యవసాయం ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉండేది. కరంటు ఉండక పంపుసెట్లు నడువక రైతుల కళ్లెదుటే పంటలు ఎండుతుండే. 2014లో రాష్ట్రంలో కొలువు దీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. 2018 జనవరి ఒకటి నుంచి వ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరంట్ సరఫరా చేస్తున్నది. లో వోల్టేజీ సమస్యకూ చెక్ పెట్టింది. ప్రాజెక్టులూ కట్టి నీటి వనరులను పెంచడంతో ఇక్కడి భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారడంతో రైతులు సంబురపడుతున్నారు.
వరంగల్, డిసెంబర్ 31(నమస్తేతెలంగాణ) : వ్యవసాయానికి నిర్దేశిత వేళల్లో కరంటు. ప్రకటించిన సమయంలో కూడా సరఫరా అవుతుందో లేదో తెలియదు. ఎప్పుడొస్తుందో, వచ్చిన తర్వాత ఎంత సేపు ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి. కరంటు రాగానే అప్పటివరకు వేచి ఉన్న పంపుసెట్లన్నీ ఒకేసారి ఆన్ కావడంతో లోవోల్టేజీ సమస్య. మోటర్లు కాలిపోతే రిపేరు కోసం మెకానిక్ వద్దకు పరుగు.. మరమ్మతు జరిగే వరకు వరుసగా కొద్దిరోజులు పంటకు నీరు బంద్. పంపుసెట్ రిపేర్ కోసం కొంత డబ్బు ఖర్చు.. వచ్చే కరంటు విడుతల వారీగా కావడం వల్ల రాత్రి పూట ఇల్లు, కుటుంబాన్ని వదిలి చీకట్లో పంట చేనుకు నీరు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి.
పాములు, తేళ్లు, అటవీ జంతువుల బారిన పడి మృత్యువాత లేదా గాయాల పాలు కావడం. కొన్ని సందర్భాల్లో రాత్రివేళ విద్యుత్ఘాతానికి గురై ప్రాణాలొదలడం.. విద్యుత్ కోతలు, కొరత, కష్టాలు, ఫలితంగా వాటిల్లుతున్న నష్టాలపై సబ్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నా, రాస్తారోకోలు. సబ్స్టేషన్లు, ప్రభుత్వ ఆఫీసులపై దాడులు, ఫర్నిచర్ ధ్వంసం. వెరసి పోలీసు కేసుల నమోదు, అరెస్టులు. ఈ కరంటు కష్టాలతో చివరకు పంటల సాగుపై విరక్తి కలిగి వ్యవసాయానికి గుడ్‌బై.. తెలంగాణ ఆవిర్భవించడానికి ముందు రైతులకు ఎదురైన పరిస్థితి ఇది.
స్వరాష్ట్ర సాధనతో వ్యవసాయంలో రైతులకు కరంటు కష్టాలు క్రమేణా తొలగిపోయాయి. 2014లో తెలంగాణ రాష్ట్రంలో కొలువు దీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం కరంటుపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యుత్ ఉత్పత్తి పెంపు దిశగా అడుగులు వేస్తూనే సరఫరాను మెరుగుపరిచింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో కరంటు కోతలు, కొరతకు చరమగీతం పాడింది. కొద్దికాలంలోనే నిరంతరం ఇచ్చే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం చేరుకుంది. 2018 జనవరి ఒకటి నుంచి వ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా అమల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి ప్రకటించినట్లు నిరంతరం విజయవంతంగా అందిస్తున్నది. అమల్లోకి వచ్చి ఇప్పటికే ఐదేళ్లు గడించింది. దిగ్విజయంగా ఆరో సంవత్సరం మొదలైంది. కరంటు కష్టాలతో వద్దనుకున్న వ్యవసాయాన్ని రైతులు తిరిగి మొదలుపెట్టారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం సాగునీటి వనరులను అభివృద్ధి చేయడంతో సాగు విస్తీర్ణం కూడా పెంచారు. గతంలో ఎకరం రెండు ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఇపుడు ఎనిమిది నుంచి పది ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి కూడా ఇస్తుండడంతో సంబురంగా వ్యవసాయం చేస్తున్నారు. కరంటు సరఫరాకు నిర్దేశిత వేళలు లేకపోవడంతో తమకు సమయం దొరికినప్పుడు పంట చేను వద్దకు వెళ్లి పంపుసెట్లు ఆన్ చేస్తున్నారు. రాత్రివేళ పంట చేను వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. లోవోల్టేజీ సమస్యకు తెరపడింది. పంపుసెట్ కాలిపోవడం, మెకానిక్ వద్దకు వెళ్లడం, రిపేర్ ఖర్చుకు పెట్టుబడి అనేది ఇప్పుడు లేదు. దండుగన్న వ్యవసాయం స్వరాష్ట్రంలో పండుగలా మారిందని సంబుర పడుతున్నారు.
రోజుకు మూడు మిలియన్ యూనిట్లు..
జిల్లాలో పాకాల, మైలారం రిజర్వాయర్లు, చెరువుల కింద ఉన్న ఆయకట్టును పక్కనపెడితే ఏటా వానకాలం, యాసంగి సాగులోకి వస్తున్న ఇతర పంటలకు రైతులు బోర్లు, బావుల ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్లు, బావుల వద్ద పంపుసెట్లను అమర్చారు. వీటికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచి త కరంటును వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 65,340 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక 220కేవీ, ఆరు 132కేవీ, 74 థర్టీత్రీ కేవీ సబ్స్టేషన్ల ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు కరంటు సరఫరా కొనసాగుతున్నది. సగటున ప్రతి రోజు మూడు మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు.
వానకాలం 2.5 మిలియన్ యూనిట్లు, యాసంగిలో 3 నుంచి 3.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతులు బోర్లు, బావుల కింద యాసంగి వరి నాట్లు వేసే పనుల్లో తలమునకలయ్యారు. దీంతో ఇప్పుడు రోజుకు మూడు మిలియన్ యూనిట్ల కరంటు వినియోగం జరుగుతుందని, మరికొద్ది రోజుల్లో ఇది మూడున్నర మిలియన్ యూనిట్ల వాడకానికి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరాతో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి ఆశించిన లాభాలను పొందుతున్నారు. నిరంతర కరంటుకు బిల్లు చెల్లించడం కూడా లేకపోవడంతో రైతులకు పెట్టుబడి భారం తగ్గింది.
కరెంటు బాధ తప్పింది..
– వీరాటి రవీందర్‌రెడ్డి, రైతు, కొమ్మాల
గీసుగొండ, డిసెంబర్ 31 : సమైక్య రాష్ట్రంలో కరంటు లేక పంటలు ఎండిపోయేవి. అప్పుడు పగలు 3 గంటలు, రాత్రి 4 గంటలు మాత్రమే కరంటు వచ్చేది. దీంతో రైతులు ఎటు పోకుండా కరంటు కోసం కావలి కాసేది. ఏదైనా ఫంక్షన్, దేవుళ్ల కాడికి కూడా పోకపోయేది. ఎటైనా పోతే పంట ఎండిపోతుందని ఇంటి వద్ద ఉండి నీళ్లు పారించుకునేది. రాత్రి వేళల్లో వ్యవసాయ బావుల వద్దే పడుకునే వాళ్లం. ఇప్పుడు కరెంటు గోస లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరంటు ఇస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా పంటలకు నీళ్లు పారించుకుంటున్నం. ఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా పంటలు సాగు చేసుకుంటున్నం.
నిరంతర కరంటుతో ఎంతో మేలు..
– దండు అశోక్, రైతు, కొంకపాక
పర్వతగిరి, డిసెంబర్ 31 : సీఎం కేసీఆర్ 24 గంటల కరంటు సరఫరా చేయడం వల్ల కొంకపాకలో నాలుగు ఎకరాల్లో పంటలు సాగు చేసిన. నాకు సంవత్సరానికి రెండు పంటల మీద రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. గతంలో రాత్రి పూట విద్యుత్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో రైతుల కష్టాలు దూరమయ్యాయి. రాత్రి పూట కరంటు ఉన్నప్పుడు అవస్థలు పడేవాళ్లం. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రైతులు, వారి కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాయి.