ఖిలావరంగల్, ఏప్రిల్ 8: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ నత్తనడకన కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది పర్వదినం నుంచి సన్న బియ్యం పంపిణీ జరిగితే.. తూర్పు నియోజకవర్గంలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని ఈ నెల 5న ప్రారంభించారు. మూడు రోజులు కాకముందే పలు రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు. మరికొంత మంది డీలర్లు బియ్యం ఉన్నా ఇచ్చే తీరిక, ఓపిక లేక రేషన్ షాపులను మూసేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఎంతో ఆర్భాటం చేయడంతో పేదలు ఆశగా రేషన్ షాపుల బాట పడుతున్నారు. అయితే, షాపులకు వెళ్లిన లబ్ధిదారులకు సన్న బియ్యం స్టాక్ అయిపోయిందని, దొడ్డు బియ్యం మాత్రమే ఉన్నాయని డీలర్లు చెప్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మండలంలో 85, ఖిలావరంల్ మండలంలో 72 రేషన్ షాపులకు 8,700 క్వింటాళ్ల చొప్పున బియ్యం ఎనుమాములలోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ రెండు మండలాలకు ఇంకా 25 శాతం సన్న బియ్యం సరఫరా కావాల్సి ఉందని అధికారులు పేర్కొనడం గమనార్హం.