సంగెం, డిసెంబర్ 3 : స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లా సంగెం మండలంలోని వంజరపల్లిలో విచిత్రం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి రెండో విడతలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఇక్కడ ఎస్టీ జనాభా లేకున్నా సర్పంచ్ పదవితోపాటు మూడు వార్డు స్థానాలు వారికే కేటాయించారు. దీంతో ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా సర్పంచ్‌తో పాటు మూడు వార్డులకు కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. వివరాల్లోకి వెళితే.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ ఊరిలో 538 మంది ఉండగా, 373 మంది ఓటర్లున్నారు. వీరిలో 180 మంది పురుషులు, 193 మంది స్త్రీలు ఓటర్లుగా నమోదు కాగా ఎస్టీలు లేరు. గ్రామంలో 8 వార్డులుండగా సర్పంచ్‌ను ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో పాటు 1, 4, 6 వార్డులను వారికే రిజర్వ్ చేశారు.
గత సెప్టెంబర్‌లో రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు గ్రామస్తులు ఎంపీడీవో, కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్‌కు అక్టోబర్ 1న వినతిపత్రం అందజేశారు. తమ ఊరిలో ఎస్టీలు లేరని, గ్రామ జనాభా ఆధారంగా రిజర్వేషన్ ప్రకటించాలని కోరారు. అయినా వారి గోడును ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత నోటిఫికేషన్లో గ్రామ సర్పంచ్ పదవితోపాటు మూడు వార్డు స్థానాలు ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో గ్రామస్తులు ఎన్నికలు ఆపాలని హైకోర్టును ఇటీవల ఆశ్రయించారు.
దీంతో మంగళవారం విచారణ జరిపిన జడ్జి డివిజన్ బెంచ్‌కు నివేదించారు. కాగా, 2011కు ముందు వంజరపల్లితోపాటు రేఖ్యానాయక్తండాను కలుపుకొని గ్రామపంచాయతీని ఏర్పాటు చేశారు. అప్పుడు ఎస్టీ జనాభా ఉండేది. 2019లో నూతన గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా రేఖ్యానాయక్తండాను పోచమ్మతండాలో కలిపారు. ఆ జనాభా ప్రకారమే వంజరపల్లిలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. 2019లో మూడు వార్డు స్థానాలు ఎస్టీకి కేటాయించగా, ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. మళ్లీ అవే వార్డులకు అదే రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
అధికారుల నిర్లక్ష్యం వల్లే వంజరపల్లి గ్రామసర్పంచ్ ఎన్నిక అస్తవ్యస్తంగా మారింది. మా గ్రామంలో బీసీలు, ఎస్సీలు తప్ప మరే కులాలు లేవు. అయినా గ్రామ సర్పంచ్‌తో పాటు మూడు వార్డులను ఎస్టీలకే కేటాయించారు. మా గ్రామంలో ఎస్టీలు లేరని ఎంపీడీవో, ఆర్డీవో, కలెక్టర్, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. వంజరపల్లి ఎన్నికను నిలిపివేయాలి.
– సోమిడి శ్రీనివాస్, వంజరపల్లి గ్రామస్తుడు