మేడారం కేంద్రంగా 40 కిలోమీటర్ల భూమి లోపల ప్రకంపనలు సంభవించి భూకంపం వచ్చిందని ములుగు కలెక్టర్ టి.ఎస్.దివాకర తెలిపారు. ఉదయం 7:27 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదైనట్లు పేర్కొన్నారు. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం పెద్దగా జరగలేదని తెలిపారు. ప్రజలకు రక్షణ చర్యలు కల్పించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో చిన్న చిన్న ఇండ్ల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. భూకంపంతో తాను సైతం ఆందోళనకు గురై ఇంటి నుంచి బయకు వచ్చానని.. జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.
– ములుగు కలెక్టర్ దివాకర
మొన్న టోర్నడో బీభత్సంతో నేలమట్టమైన మేడారం అటవీ ప్రాంతం.. ఇప్పుడు భూకంపానికీ కేంద్రమై మళ్లీ అలజడి రేపింది. నాటి పెను విధ్వంసానికి వందల ఎకరాల్లో చెట్లు కూలిపోయి ఇంకా కుదురుకోకమేందే.. బుధవారం మరోసారి భూకంపం రూపంలో ప్రకంపనలు సృష్టించడంతో ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉదయం 7.28గంటలకు 5 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురై, గోడలకు పగుళ్లు తేలడంతో ఏం జరుగుతున్నదో తెలియక బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా ములుగు, భూపాలపల్లిలో తీవ్రత ఎక్కువగా కనిపించగా మిగతా చోట్లా ప్రభావం కనిపించింది. అయితే పగబట్టినట్టు ప్రకృతి మరోసారి విరుచుకుపడడం ఎలాంటి హెచ్చరికలకు సంకేతమని సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా పలుచోట్ల రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలతో పాటు ఉదయం నుంచి తమకు ఎదురైన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
– ములుగు, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)/నమస్తే నెట్వర్క్
‘భూకంపం వచ్చిందట కదా! మీకు ఏమైనా తెలిసిందా?’ మా ఇంట్లో గిన్నెలు కిందపడ్డాయి.. ఊయల ఊగినట్టు అనిపించింది? నేనైతే ఒక్కసారిగా కింద పడబోయిన. బీపీ తక్కువై అట్ల అయిందేమో అనుకున్నా. మా గోడకు పగుళ్లు వచ్చాయి? ఇలా బుధవారం ఉదయం 7 తర్వాత అన్నిచోట్ల ఇదే ముచ్చట. తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతం భూకంపానికి కేంద్రం కావడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మూడు నెలల క్రితం సుమారు 500 ఎకరాలకు పైగా భారీ వృక్షాలు ఒకే వైపునకు నేలమట్టమైన సంఘటన మరువక ముందే ఇదే ప్రాంతం నుంచి భూకంపం చోటుచేసుకోవడం పర్యావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా అని తెలుస్తున్నది. బుధవారం ఉదయం 7.27 గంటలకు సంభవించిన భూ ప్రకంపనలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇండ్లలోని వస్తువులు కిందపడడంతో పాటు ఇండ్లు ఊయలలో ఊగినట్లు 5 సెకన్ల పాటు కదలడంతో ప్రజలు బయటకు పరుగులు తీసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం కారణంగానే వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు నిర్ధారించారు.
1969లోనూ ములుగు ప్రాంతం కేంద్రంగా భూకంపం సంభవించిందని ప్రజలు చర్చించుకున్నారు. అప్పుడు ఎండాకాలంలో రాత్రి 8గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఇండ్లను వదిలి బయటకు పరుగులు తీశారని, రాత్రంతా జాగారం చేశామని గుర్తుచేసుకున్నారు. మరికొందరు వాకిళ్లలో నిద్రించారని పేర్కొన్నారు. మళ్లీ 55 ఏండ్ల తర్వాత బుధవారం భూకంపం వచ్చింది. ఈ ప్రకంపనలతో జిల్లాలోని తొమ్మిది మండలాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన భూకంప దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భూకంప సంఘటన తీవ్ర దూమారం రేపింది. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఉన్న సీసీ కెమెరాలో సైతం భూకంపం కారణంగా గద్దెల ప్రాంగణం కదిలిన దృశ్యాలున్న వీడియోలు సాక్ష్యంగా నిలిచాయి.