వరంగల్, మే 27 : నగర మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొందరు కార్పొరేటర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. మేయర్ పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెను పదవి నుంచి తప్పించాలని కొందరు కార్పొరేటర్లు పావులు కదుపుతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధికా గుప్తాను కొందరు ఇటీవల కలిసి అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చేందుకు విధి విధానాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.
అదనపు కలెక్టర్ సైతం గ్రేటర్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మాన నోటీస్ ఫార్మాట్ పంపాలని గ్గేటర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పాలకవర్గంలో 50శాతానికిపైగా కార్పొరేటర్లు పెడితేనే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుందని కార్పొరేటర్లకు చెప్పినట్లు సమాచారం. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మూడేళ్ల కాలపరిమితి నిబంధన ఉంది. మే 7వ తేదీతో మూడేళ్లు పూర్తి కాగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అవిశ్వాస తీర్మాన నోటీస్ ఇచ్చేందుకు కొందరు కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు. అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీలో ఉండి అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేస్తే పరిస్థితులు ఉంటాయనే దానిపై కొందరు కార్పొరేటర్లు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.
పాలకవర్గంలోని సగం మంది కార్పొరేటర్ల కంటే ఎక్కువ మంది అంటే 34 మంది తీర్మానం పెట్టేందుకు సంతకాలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వాలంటే సొంతంగా బీఆర్ఎస్కు సంఖ్యా బలం లేదు. బీజేపీ కార్పొరేటర్లతోపాటు అధికార పార్టీలోని కొందరు కార్పొరేటర్లు అది సాధ్యమవుతుంది. ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కొందరు కార్పొరేటర్లు బలంగా పనిచేస్తున్నారు.