హనుమకొండ చౌరస్తా, జూన్ 19: మిమిక్రీ కళను విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ అని కేంద్ర పురస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత అంపశయ్య నవీన్ అన్నారు. శుక్రవారం నేరెళ్ల వేణుమాధవ్ 8వ వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ల విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. నేరెళ్ల వేణుమాధవ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దారన్నారు. మిమిక్రీ కళకు హోదా కల్పించి, ఉపాధి కల్పించారన్నారు.
మిమిక్రి సిలబస్‌ని తయారు చేసిన ఆయన డిప్లొమా కోర్స్‌ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టి.. ఎందరో నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్న మహోన్నత వ్యక్తి డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్‌ని కొనియాడారు. ఆయన లేకపోవడం మిమిక్రీ కళకు తీరని లోటన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభావతి మాట్లాడుతూ..అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేనితనంతో పబ్లిక్‌గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో అభివృద్ధికి దూరంగా ఉంటుందని, రంగులు వేయడంలేదన్నారు.
రూంలో నీళ్లు రాకపోవడంతో కార్యక్రమాలు నిర్వహించే కళాకారులు ఇబ్బందులు తప్పడంలేదని ఈ విషయంపై అందరం కలిసి మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయాలని సూచించారు.నవంబర్ 14లోగా మరమ్మతులు చేయించి నూతనంగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. అలాగే పిల్లల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాటక పోటీలు నిర్వహించాలని ఇందులో గెలుపొందినవారికి మొదటి ప్రైజ్ కింద రూ.పది వేలు, రెండో బహుమతి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు శోభావతి తెలిపారు.
కవులు రామా చంద్రమౌళి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, వరిగొండ కాంతారావు, గిరిజా మనోహర్, వనం లక్ష్మీకాంతారావు, తోట పూర్ణచందర్, నేరెళ్ల వేణుమాధవ్ కుమారుడు నేరెళ్ల రాధాకృష్ణ, కోడలు శ్రీలత, నేరెళ్ల శ్రీనాథ్, మ్యాజిక్ వెంకటరమణ, మ్యాజిక్ రాజశేఖర్, సింగర్ మధు, నల్ల శ్రీనివాస్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిమిక్రీ కళాకారులు అంజన్‌కుమార్, బాబర్, కిరణ్‌కుమార్, దామోదర్, ముజ్జిక సదాశివరావు, బాబా పాల్గొని సినీరంగంలోని ప్రముఖ హీరోలతో పాటు, రాజకీయ నేతలు, వివిధ పక్షుల గళాలను వినిపించి ఆతులను ఎంతగానో ఆకట్టుకున్నారు.