పోచమ్మమైదాన్, నవంబర్ 22 : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి, వరంగల్ ఇన్నర్ వీల్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నేరెళ్ల శోభావతిని ‘నిస్వార్థ సేవా పురస్కారం’ వరించింది. ఈ నెల 24న హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఇన్నర్‌వీల్ క్లబ్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు. ఎలాంటి పదవి లేకున్నా క్లబ్ ద్వారా నాలుగున్నర దశాబ్దాల నుంచి నిస్వార్థంగా అందిస్తున్న సేవలను గుర్తించి అవార్డుకు ఎంపికయ్యారు. శోభావతికి అవార్డు రావడం పట్ల క్లబ్ అధ్యక్షురాలు ఎన్.లావణ్య, ప్రధాన కార్యదర్శి ఎం రేణుక శుభాకాంక్షలు తెలిపారు.
పేద మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు సేవలందించేందుకు గాను వరంగల్‌లో 1976 సంవత్సరంలో ఇన్నర్ వీల్ క్లబ్‌కు శ్రీకారం చుట్టారు. పది మంది సభ్యులతో మొదలైన క్లబ్ ఇవాళ 80కి చేరింది. అలాగే జాతీయ స్థాయిలో ఏ క్లబ్‌కు కూడా సొంత భవనం లేదు. కానీ వరంగల్‌లో 1992లోనే సొంత భవనం నిర్మించారు. ఇక్కడి నుంచే పేదలకు సేవలను విస్తృతపరుస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
క్లబ్ ద్వారా అనేక సేవందిస్తున్నారు. పేద మహిళల జీవనోపాధి కోసం ఉచితంగా కుట్టుశిక్షణ అందిస్తున్నారు. 25 ఏళ్ల నుంచి మూడు నెలలకు 40 మంది చొప్పున ఇప్పటివరకు నాలుగువేల మందికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పేదలను గుర్తించి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. గృహిణులకు రోజూ ఉదయం యోగా, మ్యూజిక్, నృత్యం, పిల్లలకు సాయంత్రం కూచిపూడి, సంగీతం నేర్పిస్తున్నారు. ఏటా పదో తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు సులోచన అవార్డుల పేర నగదు పారితోషికం అందిస్తున్నారు. అలాగే 7, 8, 9 తరగతుల్లో ఫస్ట్ క్లాస్ వచ్చినవారికి బాల భాస్కర్ అవార్డుల పేర నగదు పారితోషికాలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు గుర్తించి సేవలు అందించడం, వృద్ధుల ఆశ్రమాలు, ఎయిడ్స్ వ్యాధి పిల్లలు అవసరాలు గుర్తించి సహాయ, సహకారాలు అందించి అక్కున చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆటోనగర్‌లోని అంధు ల పాఠశాలను దత్తత తీసుకుని ప్రతి నెలా ఉపాధ్యాయులకు రూ.10వేల వేతనం చెల్లించడంతో పాటు రూ.4లక్షల వ్యయంతో ఫస్ట్ ఫ్లోర్లో భవనం నిర్మాణం, ఇతర వసతులు కల్పించారు.
క్లబ్ సభ్యుల సహకారంతో పేదలకు సేవలు అందిస్తున్నాం. 48ఏళ్ల నుంచి పేద మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సహాయ, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి పేద మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఏటా రూ.10వేలు అందిస్తున్నాం. తొలుత 15మందికి ఇచ్చాం.