హనుమకొండ చౌరస్తా, మే 6: వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ ఆధ్వర్యంలో జూన్ 13, 14, 15 తేదీల్లో పోతన విజ్ఞాన పీఠంలో మూడు రోజులపాటు 16వ జాతీయస్థాయి తెలుగు నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.ఎస్.ఆర్. మూర్తి తెలిపారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ శాఖగా ఏర్పాటు 23 సంవత్సరాలు అవుతుందన్నారు.
కొంతకాలం గుంటూరు కేంద్ర కార్యాలయం వరంగల్ జిల్లా శాఖగా ఏర్పడి 2006 వరకు కొనసాగిందని కాలక్రమేన తెలంగాణ రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక గా, జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదికగా 2011లో రిజిస్ట్రేషన్ అయిందన్నారు. అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు పోటీలు జానపద కళారూపాలు ఉచిత నటన శిక్షణ తరగతులు నిర్వహించి రాష్ట్రాల్లో ఉన్న రంగస్థలం కళాకారులను ఉన్నతగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే నాటక పోటీలలో ఆంధ్ర ప్రాంతం నుంచి మూడు తెలంగాణ ప్రాంతం నుండి మూడు నాటికలు ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సంస్కృతిక సారధి చైర్మన్ మావిడాల హరికృష్ణ తోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో ప్రదర్శించిన ప్రతి నాటికకు రూ.15 వేలు ప్రదర్శనా పారితోషికం ఉత్తమ, ద్వితీయ నాటికకు రూ.6 వేలు, రూ.4 వేల నగదు బహుమతుల్ని ఇవ్వనున్నట్లు, వ్యక్తిగత ప్రైజులు కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు వేముల ప్రభాకర్, బిట్టవరం శ్రీధర్ స్వామి, సంయుక్త కార్యదర్శి కుసుమ సుధాకర్, కుడికాల జనార్ధన్, కోశాధికారి సాదుల సురేష్, కార్యవర్గ సభ్యులు మాలి విజయరాజ్, జూలూరి నాగరాజు పాల్గొన్నారు.