న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: రూ. 80,000 కోట్ల విలువైన వివాదాస్పద గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) సోమవారం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను ఎన్జీటీ తిరస్కరించింది. ఈ మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో జోక్యం చేసుకోవడానికి గణనీయమైన ఆధారాలు లేవని, దాని పర్యావరణ అనుమతిలో తగిన రక్షణలు కల్పించడం జరిగిందని ఆరుగురు సభ్యుల ఎన్జీటీ ప్రత్యేక బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది. ఎన్జీటీ తీర్పును పర్యావరణవేత్తలు వ్యతిరేకించారు.
ఈ ప్రాజెక్టు పర్యావరణానికి హాని చేయడమే కాకుండా గిరిజన తెగలకు ముప్పు తీసుకువస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నికోబార్ ప్రాజెక్టుకు ఎన్జీటీ అనుమతి ఇవ్వడం తీవ్రంగా నిరాశపరిచిందని కాంగ్రెస్ పేర్కొన్నది. ఇది ద్వీపంలోని స్థానిక తెగల ఉనికికి ముప్పు కలిగిస్తుందని, దీనిని ప్రభుత్వం చాపకింద నీరులా తీసుకువస్తున్నదని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గత ఏడాది ఈ ప్రాజెక్టుపై వ్యాఖ్యానించారు. కాగా విచారణ సందర్భంగా పిటిషనర్లు వ్యక్తం చేసిన అన్ని ఆందోళనలను నమోదు చేశామని, 2022లో ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతిపై ఉన్నత స్థాయి కమిటీ పునఃపరిశీలించిందని ప్రత్యేక బెంచ్ పేర్కొన్నది.
ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాముఖ్యతను, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇందులో జోక్యం చేసుకోవడానికి తగిన ఆధారాలు లేవని భావిస్తున్నట్లు ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ తెలిపారు. విదేశీ శక్తుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ ప్రమేయాన్ని ఈ ప్రాజెక్టు పెంచుతుంది. 166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం 130 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిని మళ్లించాల్సి ఉంటుంది. గ్రేట్ నికోబార్ ద్వీపంలో ట్రాన్స్షిప్మెంట్ పోర్టుతోపాటు ద్వంద్వ వినియోగ పౌర, సైనిక విమానాశ్రయం వంటి అనేక అనుబంధ ప్రాజెక్టులను నిర్మిస్తారు.