మహబూబాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రవర్తించిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. కేటీఆర్ తొర్రూరు మున్సిపాలిటీకి పరిశీలకురాలిగా ఆమెను నియమించారు. మం గళవారం ఉదయం సత్యవతి తొర్రూరుకు వెళ్లాల్సి ఉండగా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులను రాష్ట్ర ప్రభు త్వం బందిపోట్లు, టెర్రరిస్టుల్లా చూస్తూ ఇంటి చుట్టూ రాత్రీ పగలు తేడా లేకుండా పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆరోపించారు.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య కు ఓటు ఉండగా, తొర్రూరు మున్సిపాలిటీ లో ఓటు వేయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవించడంలేదని విమర్శించారు. ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ ఇలాంటి దుశ్చర్యలకు పూనుకుంటున్నదని ఎద్దేవాచేశారు.