ముంబై, ఫిబ్రవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల లభించిన మద్దతుతో వరుసగా రెండోరోజూ మంగళవారం సూచీలు లాభపడ్డాయి. 83,598 నుంచి 82,987 పాయింట్ల మధ్య కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 173.81 పాయింట్లు అందుకొని 83,450.96 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,52,688.24 కోట్లు పెరిగి రూ.4,70,11,313.57 కోట్లు(5.18 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నాయి. మరో సూచీ నిఫ్టీ 42.65 పాయిం ట్లు ఎగబాకి 25,725.40 వద్ద స్థిరపడింది.
ఐటీ రంగ సూచీ కరెక్షన్కు గురైనప్పటికీ ఇతర రంగాల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో లాభాలను కొనసాగించాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, లార్సెన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీ, సన్ఫార్మాస్యూటికల్స్, మారుతి సుజుకీ, ఇండిగో, ఎస్బీఐ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, ఎటర్నల్, టాటాస్టీల్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.