JNS | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15 : ఈనెల 16 నుంచి 18 వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు, పాల్గొనే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఛైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి తెలిపారు. బుధవారం జేఎన్ఎస్లో డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో పోటీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు, బాయ్స్ 553, గర్ల్స్ 274 మంది, వీరితో పాటు 150 మంది టెక్నికల్ అఫిషీయల్స్ పాల్గొంటారని చెప్పారు. సుమారు 100 మంది అంతర్జాతీయ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చూపనున్నట్లు, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 25 మంది సాంకేతిక అధికారులు, 70 మంది రాష్ట్ర సాంకేతిక అధికారులు, 25 మంది స్థానిక అధికారులు, 50 మంది వాలంటీర్లు పాల్గొంటారని వివరించారు.
ఛాంపియన్షిప్ యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారం చేయబడుతుందని, వివిధ ప్రదేశాల నుంచి డ్రాఫ్ట్ చేయబడిన సాంకేతిక అధికారులు, ఏఎఫ్ఐ అధికారులు ఫొటో ఫినిష్ అధికారులు, లైవ్ స్ట్రీమింగ్ బృందానికి హోటల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు వరంగల్‌లో జూనియర్ నేషనల్స్, ఆలిండియా క్రాస్ కంట్రి రేస్, ఓపెన్ నేషనల్స్, సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లు, అనేక రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లు వంటి జాతీయస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లను నిర్వహించినట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు.
సందడిగా జేఎన్ఎస్..
దేశనలుమూలల నుంచి అథ్లెట్ల రాకతో జేఎన్ఎస్ సందడిగా మారింది. అథ్లెట్లు గ్రౌండ్లో కసరత్తులు చేశారు. సింథటిక్ ట్రాక్‌పై ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. బంగారు పతకం సాధించేందుకు ఒకరోజు ముందుగానే తీవ్రంగా శ్రమించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి అన్ని వసతులు కల్పించడంతో సేద తీరారు.