నర్సంపేట, ఏప్రిల్ 25 : సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షింగా ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ నిర్వహించారు. ముందుగా పెద్ది బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలు చల్లి నివాళులర్పించారు. తర్వాత ప్లీనరీ సభాస్థలికి చేరుకున్న ఎమ్మెల్యే పెద్ది మాటాడుతూ ప్రభుత్వ లక్ష్యం నేరవేరిందని, గమ్యాన్ని ముద్దాడినట్లు తెలిపారు. ఇక బీఆర్ఎస్ ఆవిర్భాంతో పథకాలను దేశవ్యాప్తం చేయడమే తమ మనముందున్న లక్ష్యమన్నారు. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, నాయకుల యోగక్షేమాలపై ఆలోచన చేశారన్నారు. కార్యకర్తలు కూడా పార్టీ బలోపేతానికి నిస్వార్థంతో పని చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగినట్లు చెప్పారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు.
తెలంగాణ ప్రాజెక్టులపై చిన్నచూపు
తెలంగాణలోని సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలోనూ బీజేపీ చిన్నచూపు చూస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో అనేక ప్రాజెక్టులు నిర్మించారని, కేంద్ర నిధులను కేటాయించడంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీకిషన్, ఎంపీపీలు మోతె కళావతి, వేములపెల్లి ప్రకాశ్‌రావు, విజేందర్, రమేశ్, ఊడుగుల సునీ త, కాట్ల కోమల, జడ్పీటీసీలు కోమండ్ల జయ, బత్తిని స్వప్న, పత్తినాయక్, లావుడ్యా సరోజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీలో 16 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు.
ఆకట్టుకున్న ఫొటో గ్యాలరీ
నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇందులో అభివృద్ధికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. కాగా, ఇక నుంచి నర్సంపేట నియోజకవర్గంలో కార్యకర్తల సంక్షేమనిధి ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ నిధికి తాను ఏప్రిల్ నెల వేతనాన్ని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. స్పందించిన జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తాను రూ. 2 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
నర్సంపేట గులాబీమయం
ప్లీనరీకి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు వేల సంఖ్యలో తరలిరావడంతో నర్సంపేట పట్టణం గులాబీమయమైంది. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ కటౌట్లు, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నాయకులు, శ్రేణులు గులాబీ రంగు దుస్తులు ధరించి జెండాలను చేతబూని తరలివచ్చారు. ఆరు వేల మందికి పాస్‌లు జారీ చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ఫ్లీనరీలో నోరూరించే వంటలను వడ్డించారు.
ప్లీనరీలో పాటల సీడీ ఆవిష్కరణ
నర్సంపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీలో రచయిత, గాయకుడు నెల్లుట్ల సుమన్ రాసిన రెండు పాటల సీడీని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించారు. సీడీకి నిర్మాతగా జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ మేకల భరత్, సింగర్ రాంబాబు, శివ ఉన్నారు. కార్యక్రమంలో కవి గాయకులు తాళ్ల సునీల్, మాంకాల యాకూబ్, అనిత, పడిదం రాజేందర్, గాదెపాక బాబు, లక్ష్మణ్, బరిగెల రవీందర్ పాల్గొన్నారు.