ఖిలావరంగల్, జనవరి 09 : టెట్(TET) నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీఎస్ఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి నామోజు శ్రీనివాస్ అన్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు TET నుంచి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం (NPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని, అలాగే జాతీయ విద్యా విధానం NEP–2020ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులపై టెట్ రుద్దడం అన్యాయమన్నారు. సీపీఎస్ విధానం ద్వారా ఉపాధ్యాయుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్నారని తీవ్రంగా విమర్శించారు. ఉపాధ్యాయుల భద్రత కోసం వెంటనే ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని కోరారు.
NEP–2020 పేరుతో ప్రభుత్వ విద్యను బలహీనపరిచే ప్రయత్నాలను TSUTF తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఈ డిమాండ్లను తక్షణమే పరిష్కరించని పక్షంలో వచ్చే నెల 5న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల శివనగర్ ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్ర స్వామి, పాక విజయ్, తిరుపతి, ఎస్ లక్ష్మీనారాయణ, టీ దేవరాజు, టీ నరేందర్, ఎస్ కవిత, సిఎచ్ సంపత్, సుహాసిని, సుజాత, కృష్ణమూర్తి, స్వప్న, రాజు, శారద, భవాని తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.