వరంగల్,మార్చి 7: వరంగల్ మహానగరంలో నేడు, రేపు రెండు రోజుల పాటు మెగా ఆటో షో నిర్వహించనున్నారు. హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నది. రెండు రోజుల పాటు జరి గే ఆటోషోలో ఆటోమొబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయి.
తమ కంపెనీల హైరేంజ్ కార్లు, బైక్లను ప్రదర్శించనున్నాయి. రెండు రోజుల పాటు కొనసాగే ఆటోషోకు ప్రజాప్రతినిధులు, ఆధికారులు, ఆటోమొబైల్రంగ నిఫుణులు హాజరుకానున్నారు. ఒకే వేదికపై సుమారు 20కి పైగా ప్రముఖ కంపెనీల కార్లు, బైక్లు, ఎలక్ట్రిక్ బైక్లను ప్రదర్శించనున్నాయి. అన్ని వాహనాలను ఒకేచోట చూసుకోనే వెసులుబాటును మెగా ఆటోషో కల్పిస్తున్నది. సొంత వాహన కలను సాకారం చేసుకోవాలనుకునే వారి కోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా మెగా ఆటోషోను వరంగల్ నగరంలో ఏర్పాటుచేసింది.