ములుగు, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లక్షల కోట్ల రూపాయలు ఉంటేనే రాజకీయాల్లో అవకాశాలు రాని ఈ రోజుల్లో సీఎం కేసీఆర్ తనను అక్కున చేర్చుకుని ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపారని బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడా రు. సీఎం కేసీఆర్ అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గొప్ప నాయకుడన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కోట్ల రూపాయలు ఉన్న అభ్యర్థులను వెతుకుతుంటే త్యాగాల కుటుంబ అమరత్వాన్ని ఉన్నత స్థానంలో నిలపడానికి నన్ను కేసీఆర్ ప్రజల ముందు నిలిపారన్నారు. నన్ను దీవించేందుకు సభకు వచ్చిన ప్రజలను చూస్తేంటే సారు ప్రయోగం సఫలమైన ఆనందం తనకు కలుగుతున్నదన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే సమ్మక్క-సారలమ్మ, జంపన్న, పగిడిద్దరాజు నా తరఫున ప్రత్యర్థితో యుద్ధం చేస్తున్నట్లు అనిపిస్తున్నదన్నారు. తనకంటూ ఏ కుటుంబం, ఏ కోరికలు లేవని, ఇచ్చిన మాట కోసం సచ్చే దాక పని చేసే తత్వమే తనలో ఉందని తెలిపారు. అవ్వా, అయ్యా లేరని, వారు మాట నిలబెట్టుకునే తత్వాన్ని తనకు ఇచ్చారన్నారు. ప్రజలందరి అశీస్సులు ఉండాలని, తనను సాదుకున్న, సంపుకున్న మీరేనని అన్నారు. ఇయాల కొంత మంది సీఎం కేసీఆర్ ఏం చేశాడని అడుగుతున్నారని, అందరు వెక్కిరిస్తుంటే ఒక్కడై నిలిచి తెలంగాణను తెచ్చాడని అన్నారు. తెలంగాణ పల్లెలన్నీ తిరిగి వారు పడుత్ను గోస చూసి వారి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యే అయినోళ్లు వెనుకపడిన ఈ ప్రాంతం కోసం ఏ నాడూ ఆలోచించలేదని, కానీ, సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం కోసం ఆలోచించి ములుగును జిల్లా, మున్సిపాలిటీగా చేశాడన్నారు. మల్లంపల్లిని మండలం చేశారని, ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేశారని తెలిపారు. దీంతో పాటు మెడికల్ కళాశాల ఇచ్చాడని, వైద్యాన్ని సైతం అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని వివరించారు. రాష్ట్రంలోని హెల్త్ ప్రొఫైల్‌ను ములుగు నుంచి మొదలు పెట్టారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవన్నీ కనిపించడంలేదా అని ప్రశ్నించారు. మా గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. ములుగు నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ఎంతో ప్రేమ చూపారని, మరింత ప్రేమ చూపించి అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నం బ ర్-1 స్థాయికి తీసుకెళ్లాలని ప్రజల తరఫున నాగజ్యోతి సీఎంను కోరా రు. సభలో ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు వీరమల్ల ప్రకాశ్‌రావు, ఏరువ సతీశ్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్, మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్‌యాదవ్, జడ్పీటీసీ భవాని పాల్గొన్నారు.