జనగామ, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : పురపోరులో అభ్యర్థులు యువ ఓటర్లను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్లలో హామీలు గుప్పిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. తరచూ ఆన్లైన్లో ఉండే యువతను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ప్రచారం జాతీయ రాజకీయాల్లో ఉండగా, ప్రస్తుతం మున్సిపల్ స్థాయి ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పట్టణ యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు, కార్మికులను ఆకట్టుకొని ఓట్లు కొల్లగొట్టి కౌన్సిలర్‌గా గెలుపొందేందుకు అభ్యర్థులు ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్ల పుణ్యంతో నేటి యువత సోషల్ నెట్వర్క్ సైట్లను అధికంగా ఉపయోగించుకుంటుండంతో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్, టెలిగ్రాం అప్లికేషన్ల ద్వారా ప్రచారం మొదలు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీచేస్తున్న యువకులు తాము పోటీ చేసే వార్డుతోపాటు తాము చేయబోయే పనులను సైతం సోషల్ నెట్వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు.
తమ బయోడేటాతో సహా పార్టీ కార్యక్రమాల్లో తాము పాల్గొన్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ లైక్స్, షేరింగ్, కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థి ప్రచారానికి ఖర్చు, కఠినమైన ప్రవర్తనా నియమావళి ఉండడంతో అభ్యర్థులు ఖర్చులేని, ఎన్నికల సంఘం పరిధిలోకి రాని సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాపై అవగాహనలేని సీనియర్ అభ్యర్థులు సైతం తమ కుటుంబంలోని యువకుల సహకారంతో అకౌంట్లు నిర్వహిస్తున్నారు. దీంతో ఇంటింటికి తిరిగి ఓటర్లకు చెప్పాలనుకున్న సమాచారాన్ని అభ్యర్థుల తరఫున వారి కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో విద్యా సంస్థలు, కళాశాలలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. పరిసర గ్రామాల ప్రజలు పిల్లల చదువులు, ఉద్యోగాలు, వ్యా పారం కోసం పట్టణాల్లో స్థిర నివాసం ఉంటూ పట్టణ ఓటర్లుగా మారారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులతోపాటు విద్యార్థులు, యువత, గృహిణులు సైతం స్మార్ట్ ఫోన్లు వాడుతుండడంతో అభ్యర్థులు దీన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులు వారి మద్దతుదారులు సాధారణ ఎన్నికలకు దీటుగా హామీలు గుప్పిస్తున్నారు.
ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్వతంత్రులు విస్తృత ప్రచారం చేస్తుండడంతో ఉమ్మడి జిల్లా పట్టణాల్లోని వార్డుల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తున్నది. వార్డులు, కులాలు, యువత, మహిళా, దివ్యాంగులు, పెన్షన్‌దారులు, రిటైర్డు ఉద్యోగుల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ అకౌంట్లు ప్రారంభించి అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
అభ్యర్థులు ఓట్ల కోసం ఓటర్లకు ఆడియో, వీడియో రికార్డుల ద్వారా వేడుకోలు, విజ్ఞప్తులు సహా ప్రత్యర్థులపై పోస్టులు, కామెంట్లు పెడుతూ..తనను గెలిపిస్తే వార్డుకు చేసే పనులను హామీల రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. తమకు అనుకూలంగా కరపత్రాలు, పోస్టర్లు ముద్రించుకోవడం, గ్రామీణ ఓటర్లను ఆకర్షించేలా పాటలు పాడించుకొని వాటిని సోషల్ మీడియా ద్వారా నేరుగా ఓటర్ల కు చేర్చుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీల వారీగా గ్రూపులు క్రియేట్ చేసి తమ పార్టీ వార్డుకు చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, తనను గెలిపిస్తే జరగబోయే అభివృద్ధిని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు.