కమలాపూర్, నవంబర్ 4: కార్పొరేట్‌ను తలదన్నేలా మహా త్మా జ్యోతిబాపూలే విద్యాలయం ముస్తాబైంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యకు పెద్దపీట వేసింది. విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉండేలా ప్రైవేట్ విద్యా సంస్థలకు తీసిపోకుండా భవనాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కమలాపూర్ ఎంజేపీ బాలికల విద్యాలయాన్ని సువిశాలమైన గదులతో అందంగా తీర్చిదిద్దారు. ఆధునిక హంగులతో తరగతి గదులు, హాస్టల్, డైనింగ్ హాల్, ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని నిర్మించారు. దీంతోపాటు సెక్యూరిటీ సిబ్బంది ఉండేందుకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్లతో ఎంజేపీ విద్యాలయ భవనాల నిర్మాణం పూర్తయ్యింది.
500 మంది విద్యార్థులకు పైగా చదువుకునేందుకు తరగతి గదులతో కూడిన ప్రత్యేక భవనం, వసతి గృహం(హాస్టల్), భోజనాలు వడ్డించేందుకు డైనింగ్ హాల్, ఉపాధ్యాయులు నివాసం ఉండేందుకు ప్రత్యేక భవన సముదాయం, ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉండేందుకు గదుల నిర్మాణాలను కార్పొరేట్ హంగులతో నిర్మించారు. కమలాపూర్-హనుమకొండ వెళ్లే మార్గంలో గూడూరు-కమలాపూర్ గ్రామాల మధ్య ఎంజేపీ గురుకుల విద్యాలయాల భవనాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం బాలికల విద్యాలయం బాలుర విద్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. బాలికల విద్యాలయ భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎంజేపీ బాలుర, బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా బాలికల విద్యాలయాలు ఒకే చోట ఉండడంతో కమలాపూర్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది.