ఏటూరునాగారం, ఏప్రిల్ 2 : పండుగ రోజున గోదావరిలో పుణ్యస్నానం కోసం వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరులో శనివా రం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. నాలుగు పడవల ద్వారా వలలు వేసి గాలిస్తున్నా రు. గల్లంతైన వారిలో ఇద్దరు ఇంటర్, ఒకరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఉగాది సందర్భంగా రొయ్యూరు నుంచి సమీప గోదావరిలో లక్ష్మీదేవరకు పుణ్నస్నానం చేయించడం ఆచారంగా వస్తోంది. ఈక్రమంలో శనివారం ఉదయం 12గంటల సమయంలో లక్ష్మీదేవరను స్నానానికి తీసుకెళ్లారు. కాగా, ఇదే గ్రామానికి చెందిన డొంగిరి సందీప్(15), బెడిక సతీశ్(17), ఆకుదారి సాయివర్ధన్(17) కూడా మొక్కులు చెల్లించుకునేందుకు కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ తీసుకొని గోదావరికి వెళ్లారు. గోదావరిలో ఒక వైపు లక్ష్మీదేవరకు గంగస్నానం చేయిస్తుండగా, అక్కడికి సమీపంలో వీరు కూడా స్నానం చేస్తున్నారు.
పక్కనే మడుగు(లోతైన ప్రదేశం) ఉన్నట్లు గుర్తించలేకపోయారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు మడుగులో స్నానం చేస్తూ మునిగిపోయారని స్థానికు లు చెప్పారు. విషయం తెలుసుకున్న సందీప్ తల్లిదండ్రులు సమ్మయ్య, జయమ్మ, సాయివర్ధన్ తల్లిదండ్రులు లక్ష్మయ్య, రాంబాయిలు, సతీశ్ తల్లిదండ్రులు స్వామి, సమ్మక్కలతోపాటు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే ఎస్సై ఇందిరయ్యతో పాటు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి నాలుగు పడవలతో గాలింపులు చేపట్టారు. మడుగు చుట్టూ వలలు వేసి గాలింపులు చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ సర్వర్‌పాషా సంఘటనా స్థలానికి పరిస్థితిని సమీక్షించారు.
ఇద్దరు ఇంటర్, ఒకరు తొమ్మిదో తరగతి
గోదావరిలో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరు ఇంటర్ చదువుతుండగా ఒకరు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డొంగిరి సందీప్ ములుగు సమీపంలోని జాకారం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆకుదారి సాయివర్ధన్ ఏటూరునాగారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేస్తున్నాడు. ఇక బెడిక సతీశ్ జనగామలోని కళాశాలలో ఇంటర్ చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏఎస్పీ
గోదావరిలో ముగ్గురు గల్లంతైన ప్రదేశాన్ని ఏఎస్పీ అశోక్‌కుమార్, సీఐ కిరణ్‌కుమార్ సందర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఐ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. కాగా సాయంత్రం వరకు సాయివర్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు.