ములుగు, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతం చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈమేరకు పలువురు అధికారులను వారు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. అధికారులు ముందు నుంచి ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదన్నారు. అమ్మవార్లకు మొకులు చెల్లించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారని చెప్పారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని పేర్కొన్నారు. మేడారం మహాజాతరకు సీఎం కేసీఆర్ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. నాలుగు జాతరలకు కలిపి రూ.332.71కోట్లు వెచ్చించగా, ఇందులో ఈసారి రూ.75కోట్లు మంజూరు చేశారని వివరించారు. ఈ నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని, మౌలిక వసతుల కొరత పరిష్కరించామని తెలిపారు. నిధులు సకాలంలో విడుదల చేయడంతో పనులు త్వరగా పూర్తిచేశామన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు జంపన్నవాగు వద్ద గతంలో కంటే స్నానఘట్టాలను ఎక్కువగా నిర్మించామని చెప్పారు.
తాగునీటి సౌకర్యం, శానిటేషన్, బస చేసే భక్తులకు తాతాలిక గుడిసెలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది సమర్థంగా పనిచేశారని ప్రసంసించారు. ముఖ్యంగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అభినందించారు. ఎమ్మెల్యే సీతక, ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశారని తెలిపారు. వరుసగా నాలుగు జాతరలను పర్యవేక్షించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో దేవాదాయశాఖ తరఫున రూ.10కోట్లతో సూట్ రూమ్స్, డార్మెటరీ, క్యాంటీన్, ఇతర సౌకర్యాలతో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి కృషిచేస్తానని జాతరలో సేవలు అందించిన అన్ని శాఖల్లో ఇద్దరు ఉత్తమ అధికారుల చొప్పున ఎంపిక చేసి సీఎం కేసీఆర్‌తో సన్మానం చేయిస్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను మంత్రులు శాలువాలతో సన్మానించారు. సమాచారశాఖ రూపొందించిన సావనీర్‌ను విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ శివయ్య, ఏఎస్పీలు ఎస్ఆర్ కేకన్, గౌస్ఆలం, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఆలయ ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి మార్
మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మార్క్ చూపారు. జాతర విజయవంతానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సూచనలు చేశారు. జాతర జరిగిన నాలుగు రోజులపాటు ఇక్కడే బసచేశారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గద్దెల వద్ద భక్తులు ఎకువ సమయం వేచి ఉండకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.